వలంటీర్ల నిరసనను అడ్డుకోవడం హేయం

Best Web Hosting Provider In India 2024

ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం

ఎన్నికల హామీని నెరవేర్చమని అడగడం తప్పా? 

వారికి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ లేదా? 

సూటిగా ప్రశ్నించిన నలమారు చంద్రశేఖర్‌రెడ్డి

వలంటీర్లు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో పొడిగించవచ్చు

ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలి

గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తూ, వలంటీర్లను కొనసాగించాలి

ప్రెస్‌మీట్‌లో నలమారు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన వలంటీర్లను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్‌ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా, తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోయేందుకు వలంటీర్లు ‘ఛలో విజయవాడ’ చేపట్టారని ఆయన వెల్లడించారు. అయితే వారిని అడ్డుకోవడం ఏ మాత్రం సరికాదని తేల్చి చెప్పారు. వలంటీర్లు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదని, ఉగాది రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు, గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతూ, వారిని కొనసాగించాలని స్పష్టం చేశారు. అదే వారిప్పుడు కోరుతుంటే, అడ్డుకోవడం ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఏమ‌న్నారంటే:
– దాదాపు 2.5 లక్షల మంది వలంటీర్లకు ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ నెరవేర్చక పోగా, వారు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే ఎక్కడిక్కడ అడ్డుకోవడం దారుణం.
– డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ కూడా పలు మీటింగుల్లో వేతనాలు పెంచుతామని వలంటీర్లకు ఆశ పెట్టడమే కాకుండా కూటమి మేనిఫెస్టోలో ఆ అంశాన్ని చేర్చారు. 
– కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల హామీని నెరవేరుస్తామని తనను కలిసిన వలంటీర్లతో స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత రూల్స్‌కి విరుద్దమని చెప్పడం వారిని వంచించడమే.  
– గత ప్రభుత్వంలో వలంటీర్లు ఎంతో మంచి సేవలందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పింఛన్లు పంపిణీలో వలంటీర్లు సహకరించారు. 
– కొత్త ప్రభుత్వం వస్తే వేతనాలు పెరుగుతాయని కలలు గన్న వలంటీర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ రకరకాల సాకులు చూపించి ఉద్యోగాల్లోనే లేకుండా చేశారు. 
– గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్‌ శాఖలో జీఓ ఇచ్చి, వలంటీర్లను నియమించడం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పెద్ద పనేమీ కాదు. 
– ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వలంటీర్లను కొనసాగించడంతో పాటు, వారి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలి.  
– శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన వలంటీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వారి డిమాండ్లు అమలు చేయాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి కోరారు.

Best Web Hosting Provider In India 2024