Best Web Hosting Provider In India 2024
AP Grama Ward Secretariats : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వర్గీకరణ- వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
AP Grama Ward Secretariats : ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సచివాలయ ఉద్యోగుల వర్గీకరణపై పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
AP Grama Ward Secretariats : రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులను వర్గీకించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సచివాలయ ఉద్యోగుల వర్గీకరణపై పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యంలో భాగమేనని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు 540 రకాల సేవలను అందించాయి. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న 2.60 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లను ప్రభుత్వం తిరిగి నియమించలేదు. అసెంబ్లీ సాక్షిగానే ప్రభుత్వం వాలంటీర్లను తిరిగి నియమించమని స్పష్టం చేసింది. సచివాలయాలను వర్గీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న సచివాలయాల్లో సబ్బంది అనేది ఒక్కో చోట ఒక్కోలా ఉన్నారు. సచివాలయాల్లో సిబ్బంది అసమతుల్యంగా ఉండటంతో రేషనలైజేషన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
సచివాలయ వ్యవస్థను విభజించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో(11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలు) 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను మూడు విభాగాలుగా విభజించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 1. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 2. టెక్నికల్ ఫంక్షనరీస్, 3. యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఇలా ఉద్యోగులను విభజించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, ఉద్యోగులపై భారం పెరుగుతుందని భావిస్తోన్నారు. మరోవైపు ఈ వ్యవస్థ రద్దయితే మాత్రం వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు మున్సిపల్ శాఖకు, గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కాస్త పంచాయతీ రాజ్ శాఖకు మారిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించి మార్పుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు. వ్యవస్థలో మార్పుల వలన ఉద్యోగులకు వ్యవస్థకు మేలు చేకూర్చే నిర్ణయాలు జరగాలంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించడమే సరైన విధానం అన్నారు. అలాగే ఇంత పెద్ద వ్యవస్థపై నిర్ణయం తీసుకునే ముందు కేబినెట్, ఉన్నతాధికారులు సుదీర్ఘ అనుభవం, శాశ్వత సభ్యత్వం కలిగిన ఉద్యోగసంఘాలతో చర్చించాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య డిమాండ్ చేశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు వివిధ రకాలుగా నష్టాలు, కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాల కోసం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీని నియమించారా? లేదా? ఏర్పాటు అయి ఉంటే, అందులో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఉద్యోగులు, నేతలకు సమచారం లేదన్నారు. తమ విభాగంలో చేపట్టనున్న మార్పులపై ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వంతో పాటు సంబంధిత మంత్రి కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
మరోవైపు ఇప్పటికే సచివాలయ సేవలను ప్రభుత్వం కుదిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 540 సేవలను గ్రామ, వార్డు సచివాలయాలు అందిస్తున్నాయి. కానీ వాస్తవానికి అన్ని సేవలు సచివాలయాల్లో లేవు. భూములకు సంబంధించిన 1బీ, అడంగల్ వంటి కొన్ని సేవలను మీసేవలకు అప్పగించారు. అలాగే మరికొన్ని సేవలను గ్రామ సచివాలయాలతో పాటు, మీసేవలకు కూడా అప్పగించారు. ఇసుక బుకింగ్ వంటి సేవలను మీసేవలకు అప్పగించారు. కొన్ని సేవలకు సంబంధించిన నెట్వర్క్ను నిలిపివేశారని సచివాలయ ఉద్యోగులు తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్