Best Web Hosting Provider In India 2024
TG Indiramma Housing Scheme : గ్రామసభల్లో ఇందిరమ్మ లబ్దిదారుల జాబితాలు – వారికే తొలి ప్రాధాన్యం..!
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామసభల్లో ఇందిరమ్మ లబ్దిదారుల జాబితాలను ప్రకటిస్తామని తెలిపారు. సెక్రటేరియట్ లో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. పలు అంశాలపై ఆరా తీశారు.
మొదటి విడతలో ఇండ్ల స్ధలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆరా తీశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని పొంగులేటి చెప్పారు. పారదర్శకంగా గ్రామసభల్లో ఇందిరమ్మ లబ్దిదారుల జాబితాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రెండవ విడతలో ఇంటి స్ధలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఉద్ఘాటించారు.
సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్దిదారులకు సంబంధించిన నివాస స్ధలం ఉన్నవారి జాబితా, నివాస స్ధలం లేని వారి జాబితా రెండు జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో 274 మంది ఇంజనీర్లు మాత్రమే ఉన్నారని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం , పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజనీర్లు అవసరమని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇతర ప్రభుత్వ విభాగాలలో ఇంజనీరింగ్ సిబ్బంది సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వంటి అంశాలను పరిశీలించాలని సీఎస్ శాంతి కుమారికి మంత్రి పొంగులేటి సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు.
త్వరలోనే సర్వేయర్ల నియామకం…
త్వరలోనే సర్వేయర్ల, గ్రామాధికారుల నియామకం ఉంటుందని మంత్రి పొంగులేటి క్లారిటీ ఇఛ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని వెల్లడించారు. వీరికి అదనంగా మరో వెయ్యి మంది సర్వేయర్లు అవసరముందన్నారు. ఈ నేపథ్యంలో సర్వేయర్ల ఎంపికకు కావాల్సిన ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
ఇందుకోసం వీఆర్వో, వీఆర్ఏ నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ పరీక్షకు సంబంధిం చిన విధివిధానాలను తక్షణమే రూపొందించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్