Best Web Hosting Provider In India 2024
TG Rythu Bharosa Survey : లెక్కలు తేలుతున్నాయ్…! కొనసాగుతున్న ‘రైతు భరోసా’ సర్వే
Telangana Rythu Bharosa Survey Updates : రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా సర్వే ప్రారంభమైంది. సాగులో లేని భూములను గుర్తిస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా లెక్కలు తీస్తూ… ఆయా భూముల లెక్కలను సేకరిస్తున్నారు. జనవరి 20వ తేదీ నాటికి ఈ సర్వేని పూర్తి చేసే దిశగా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.
రైతు భరోసా పథకం పట్టాలెక్కనుంది. జనవరి 26వ తేదీ ఈ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. అయితే ఈ స్కీమ్ కు యోగ్యత లేని భూములను పక్కనపెట్టాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా సర్వేను కూడా ప్రారంభించింది.
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే….
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా స్కీమ్ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో భాగంగా… సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ బృందాలు… సర్వే నెంబర్ల వారీగా పరిశీలిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తూ… లెక్కలను రికార్డు చేస్తున్నారు.
ఈ సర్వేలో ప్రధానంగా… సాగుకు యోగ్యంగా లేని భూములు, గృహాలు నిర్మించుకున్న భూములు, లే అవుట్లుగా మారిన భూములు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, ప్రభుత్వం సేకరించిన భూములను గుర్తిస్తున్నారు.
మండలాల్లో తహసీల్దార్లు, వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో ఈ సర్వే కొనసాగుతోంది. ఆర్వోఆర్ పట్టాదారు పాస్‌పుస్తకాల జాబితా ఆధారంగా ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లగా ఉన్న భూములపై ఫోకస్ చేస్తున్నారు. ఫాం లాండ్స్ పేరుతో జరిగిన భూమార్పిడి దస్త్రాలను పరిశీలిస్తూ వాటిని పక్కన పెట్టనున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో యోగ్యత లేని భూములను గుర్తించినట్లు తెలిసింది.
ప్రస్తుతం సర్వేలో గుర్తిస్తున్న భూముల వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ లిస్టులను గ్రామసభల ముందు ఉంచుతారు. చదివి వినిపిస్తారు. చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ వివరాలను ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తారు.ఈ భూములకు రైతు భరోసా స్కీవ్ వర్తింపజేయరు. మిగిలిన భూములకు మాత్రం… పంట పెట్టుబడి సాయం అందిస్తారు.
రైతు భరోసా సర్వే పూర్తి అయిన తర్వాత… రాష్ట్రవ్యాప్తంగా సాగు చేసే భూములు ఎన్ని ఉన్నాయనే దానిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. దీని ద్వారా అన్ని లెక్కలు తేలే అవకాశం ఉంది.
రైతు భరోసా మార్గదర్శకాలు :
- రైతు భరోసా స్కీమ్ జనవరి 26, 2025వ తేదీ నుంచి అమలు చేస్తారు.
- రైతు భరోసా స్కీమ్ కింద ఎకరాకు రూ. 12000 పంట పెట్టుబడి సాయం అందిస్తారు.
- భూభారతి(ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత లేని భూములను తొలగిస్తారు.
- ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులవుతారు.
- డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
- ఎన్ఐసీ, హైదరాబాద్ వారు ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
- రైతు భరోసా స్కీమ్ ను వ్యవసాయశాఖ సంచాలకులు అమలు చేస్తారు.
- జిల్లా కలెక్టర్లు పథకం అమలును పర్యవేక్షిస్తూ, సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులుగా ఉంటారు.
టాపిక్