పేదల ఇళ్ల స్థ‌లాల‌పై స‌ర్కార్ క‌న్ను

Best Web Hosting Provider In India 2024

ఇళ్లు కట్టుకోని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు

కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకోని వారి కేటాయింపులు రద్దు

22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి

13.59 లక్షల ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన

వచ్చే కేబినెట్‌ నాటికి ఇన్‌చార్జీ మంత్రులు ప్రతిపాదనలతో రావాలని ఆదేశం

అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న చోట్ల క్రమబద్ధీకరణ

హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయాలు, సిబ్బంది కుదింపు

2,500లోపు జనాభా ఉన్న సచివాలయాల్లో ఇక ఆరుగురే ఉద్యోగులు.. మిగతా వారు ఇతర శాఖలకు.. కేబినెట్‌ నిర్ణయం  

 అమరావతి:   వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కారు కక్ష కట్టింది. గత ప్రభుత్వం కాలనీల్లో, ఇతర చోట్ల పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోని లబ్ధిదారులకు ఆ కేటాయింపులను రద్దు చేయాలని టీడీపీ కూటమి సర్కారు తాజాగా నిర్ణ­యించింది. అంతేకాకుండా కోర్టు కేసుల్లో ఉన్న ఇళ్ల స్థలాల కేటాయింపులను సైతం రద్దు చేసింది.

మరోవైపు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పేద రైతులకు మేలు చేస్తూ 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన, పట్టా, ఫ్రీ హోల్డ్‌ భూములపై కూటమి సర్కారు కన్నేసింది. వాటిని ప్రభుత్వ అవసరాల పేరుతో పారిశ్రామిక పార్కులకు, ఇళ్ల స్థలాల కోసం వినియోగించుకోవడంపై వచ్చే మంత్రివర్గ సమా­వేశం నాటికి ప్రతిపాదనలతో రావాలని జిల్లా ఇన్‌­చార్జీ మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఇక హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారధి మీడియాకు వెల్లడించారు.

» వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకోని లబ్ధిదారులకు కేటాయింపులు రద్దు. వైయ‌స్ఆర్  జగనన్న కాలనీల్లో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకోకుంటే వాటిని రద్దు చేసి ఇతర లబ్ధిదారులకు కేటాయింపు. కోర్టు కేసుల్లో ఉన్న స్థలాల కేటాయింపులు రద్దు. నివాసయోగ్యంగా లేక నిర్మాణాలు చేపట్టని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు. 

» పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని నిర్ణయం. ఇందుకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఐదు ఎకరాల్లోపు మెట్ట, రెండున్నర ఎకరాల్లోపు మాగాణి ఉన్నవారే ఇళ్ల స్థలాల కేటాయింపులకు అర్హులు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ గృహ నిర్మాణ పథకం కింద గృహ నిర్మాణ రుణాన్ని పొంది ఉండకూడదు.

» వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పేద రైతులకు మేలు చేస్తూ 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు, పట్టా భూములు, ఫ్రీ హోల్డ్‌ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడాలని మంత్రివర్గం నిర్ణయం. వీటిని పారిశ్రామిక పార్కులు, ఇళ్ల స్థలాలకు వినియోగించుకోవడంపై వచ్చే కేబినెట్‌ నాటికి ప్రతిపాదనలు సిద్ధం. రీ సర్వేలో ఎక్కడైనా  పొరపాట్లు జరిగితే సర్వే చేసి సరిదిద్దాలని నిర్ణయం.

» అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన చోట్ల క్రమబద్ధీకరించాలని నిర్ణయం. 15–10–2019 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి వర్తింపు. 150 గజాల వరకు పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ.
» పట్టణ సీలింగ్‌ భూముల క్రమబద్ధీకరణ గడువు ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు పొడిగింపు.

» హేతుబద్దీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలు, ఉద్యోగుల సంఖ్య కుదింపు. మూడు కేటగిరీలుగా గ్రామ, వార్డు సచివాలయాల వర్గీకరణ. 3,500 జనాభా పైబడిన సచివాలయాల్లో 8 మంది ఉద్యోగులు, 2500 నుంచి 3,500 జనాభా కలిగిన చోట్ల ఏడుగురు ఉద్యోగులు, 2,500 లోపు జనాభా ఉన్న ఆరుగురు ఉద్యోగులకే సచివాలయాలు పరిమితం. మిగులు ఉద్యోగులను వారి అర్హతల ఆధారంగా ఇతర శాఖల్లో వినియోగించుకోవాలని నిర్ణయం. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు పంచాయితీ సెక్రటరీ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ హెడ్‌గా ఉంటారు.

» ధాన్యం కొనుగోళ్లకు రూ.700 కోట్ల మార్క్‌ఫెడ్‌ రుణానికి ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం.

» ఏపీ ఫెర్రో ఎల్లాయిస్‌ ఫెడరేషన్‌ అసోసియేషన్‌ వినతి మేరకు విద్యుత్‌ సుంకం రాయితీ మార్చి వరకు పొడిగింపు.

» మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటు. 

» తోటపల్లి బ్యారేజీ హెడ్‌ స్లూయిస్‌పై కుడివైపు 1.0 మెగావాట్ల మినీ హైడల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌కు చెందిన మే ఎన్‌కాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీకి ఆమోదం. హెడ్‌ స్లూయిస్‌ కుడివైపు 2.7 మెగావాట్ల మినీ హైడల్‌ ప్లాంట్‌ కోసం కూడా అదే సంస్థకు ఎన్‌వోసీ జారీకి ఓకే.

» గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది కుడి మార్జిన్‌లో 0.9 కి.మీ నుంచి 2.61 కి.మీ వరకు వరద రక్షణ గోడ నిర్మాణ పనులకు రూ.294.20 కోట్లతో పరిపాలన అనుమతులకు ఆమోదం. విజయవాడ వద్ద కృష్ణా నది ఎడమవైపు మార్జిన్‌లో వరద రక్షణ గోడ నిర్మాణం వల్ల గతేడాది సెప్టెంబరులో 11.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కృష్ణ లంక, రాణీగారి తోట తదితర పల్లపు ప్రాంతాలు సురక్షితం.

» కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు 2,595 ఎకరాలు, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు 2,621 ఎకరాలను ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు. 

Best Web Hosting Provider In India 2024