Best Web Hosting Provider In India 2024
సత్తెనపల్లిలో వైయస్ఆర్‌సీపీ జెండా దిమ్మె ధ్వంసం
నంద్యాల జిల్లాలో శిలాఫలకం శిథిలం
పల్నాడు: రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో వందలాది మంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ.. వైయస్ఆర్ విగ్రహాలను, వైయస్ఆర్‌సీపీ జెండా దిమ్మెలను కూలదోస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు మొదలైనప్పటికీ.. ఫలితాల వెల్లడి తర్వాత పరిస్థితి శ్రుతిమించి పోయింది. ఎక్కడికక్కడ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైయస్ఆర్‌సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. తాజాగా పల్నాడు, నంద్యాల జిల్లాలో అల్లరి మూకలు విధ్వంసం సృష్టించారు.
అర్ధరాత్రి విధ్వంసం..
సత్తెనపల్లిలోని 18వ వార్డు జెండా చెట్టు వద్ద శుక్రవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని దుండగులు విధ్వంసం సృష్టించారు. పొక్లెయిన్ సాయంతో వైయస్ఆర్‌సీపీ జెండా దిమ్మెను తొలగించారు. ప్రొక్లెయిన్ చూసిన ఓ వ్యక్తి స్థానికులకు సమాచారమివ్వడంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావాలనే పురపాలక సంఘానికి చెందిన ప్రొక్లెయిన్‌తో ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు హెచ్చరించారు.
శిలాఫలకం ధ్వంసం..
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో రోడ్డు పక్కనే ఉన్నా అభివృద్ధి శిలా ఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో 2023 ఆగస్ట్ 8న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, తదితరులు భూమిపూజ చేసి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. పారుమంచాల ఇసుకవాగు వంతెన నిర్మాణం పనుల వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వాహనంతో ఢీకొట్టి ధ్వంసం చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా వంతెన నిర్మాణం పనులు జరుగుతుండగా గిట్టనివారు శిలాఫలకం ధ్వంసం చేయడం సబబుగా లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు పోచా జగదీశ్వరరెడ్డి, వైయస్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోసిక తిరుమలేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కేశవరెడ్డి గారి నాగార్జునరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోకల కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.