Best Web Hosting Provider In India 2024
Rajinikanth school: కన్నడలో క్లాస్ ఫస్ట్.. ఇంగ్లిష్ మీడియంలో చేరి ఫెయిలయ్యాను: స్కూలు రోజులను గుర్తు చేసుకున్న రజనీకాంత్
Rajinikanth school: బెంగళూరులోని ఏపీఎస్ ఇన్ స్టిట్యూట్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఆ పాఠశాల, కళాశాలలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఏపీఎస్ ప్రత్యేక పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో భాగంగా కన్నడలో సుదీర్ఘంగా మాట్లాడారు.
Rajinikanth school: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టి పెరిగింది మాత్రం కర్ణాటకలో అనే విషయం తెలుసు కదా. ఇప్పుడు 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత తన చిన్నతనంలో స్కూలు, కాలేజీ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. బెంగళూరులోని ఏపీఎస్ స్కూల్లో చదివిన అతడు.. పూర్వ విద్యార్థుల సమావేశంలో కన్నడలోనే మాట్లాడాడు. శివాజీ రావ్ గైక్వాడ్ గా బెంగళూరులోనే పుట్టిన రజనీకాంత్.. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు.
రజనీ వీడియో సందేశం
బెంగళూరులోని ఏపీఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన రజినీకాంత్ ఇప్పుడు ఆ పాఠశాలలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఏపీఎస్ ప్రత్యేక పూర్వ విద్యార్థుల కార్యక్రమం సందర్భంగా రజనీ ఓ వీడియోను పంచుకున్నారు. “నేను మీతో ఉండాల్సింది. కానీ బ్యాంకాక్ లో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. ఏపీఎస్ స్కూల్ అండ్ కాలేజీలో చదవడం నాకు గర్వకారణం. మొదట మిడిల్ స్కూల్ గవిపురాలో ఉండేది. కన్నడ మీడియంలో చదివాను. అప్పుడు నేను క్లాసులో ఫస్ట్. నేను బాగా చదివేవాడిని. క్లాస్ లీడర్ ని కూడా.
తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చేరి ఫెయిలయ్యాను. కన్నడలో మంచి మార్కులు రావడంతో మా అన్నయ్య నన్ను ఏపీఎస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేర్పించారు. పూర్తి కన్నడ మీడియంలో ఉన్న వ్యక్తిని ఇంగ్లిష్ మీడియంలో వేయడంతో ఇబ్బంది పడ్డాను. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఏపీఎస్ హైస్కూల్ టీచర్లందరూ నా కష్టాన్ని అర్థం చేసుకుని బోధించారు. ఎనిమిది, తొమ్మిదో తరగతిలో పాసైనా.. పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ లో మాత్రం ఫెయిలయ్యాను. తర్వాత ఓ టీచర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాకు ట్యూషన్ చెప్పారు. దీంతో నేను పాసయ్యాను” అని రజనీకాంత్ చెప్పాడు.
కాలేజీ రోజుల్లోనే నాటక రంగం వైపు..
తనకు సినిమాలపై ఎప్పుడు ఆసక్తి కలిగిందో కూడా ఈ సందర్భంగా రజనీకాంత్ చెప్పుకొచ్చాడు. “నా పాఠశాల రోజుల్లో నాటకరంగం పట్ల అభిరుచి తక్కువగా ఉన్నప్పటికీ నేను ఏపీఎస్ స్కూల్ నుండి కాలేజీలో చేరాను. కొన్ని కారణాల వల్ల చదువు కొనసాగించలేకపోయాను. స్కూల్ డేస్ లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో పాల్గొనేవాడిని. పోటీల్లో పాల్గొనక ముందు క్లాసులో రకరకాల స్టోరీలు చెప్పేవాడిని. నేను చూసిన సినిమాలను నా స్నేహితుల ముందు చూపించేవాడిని. ఆ విషయం మా టీచర్లకు కూడా తెలుసు. ముఖ్యంగా థియేటర్లలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించారు. ఆది శంకర్ చందాల నాటకంలో చందాల పాత్ర పోషించాను” అని రజనీ అన్నాడు.
“మా డ్రామాకు తగిన ప్రతిఫలం లభించింది. మేమే గెలిచాం. ఆ రోజు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. అదే ఇప్పుడు ప్రొఫెషనల్ గా మారేలా చేసింది. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వీటన్నింటికీ కారణం ఏపీఎస్ స్కూల్ అండ్ కాలేజ్. అది నాకు గర్వకారణం. ఏపీఎస్ భవనం, మైదానం, అక్కడ గడిపిన రోజులు, ఆడిన ఆటలు, ఇవేవీ మర్చిపోలేం. నేను ఆ పాఠశాలకు వెళ్లినప్పుడు మా ఇల్లు హనుమాన్ నగర్ లో ఉండేది. పెద్ద గణేష్ ఆలయం దగ్గర. అది గర్వించదగ్గ క్షణం” అని రజనీకాంత్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.