Best Web Hosting Provider In India 2024
సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు దాదాపు రూ.25 వేల కోట్ల లోటు
కేవలం ఈ రూ.11 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ గట్టెక్కదు
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అప్పులకే సరిపోవడం లేదు
అందుకే కేంద్ర ప్యాకేజీపై కార్మికుల్లో అనుమానాలున్నాయి
ఈ ప్యాకేజీపై ప్రధాని విశాఖ పర్యటనలో ఎందుకు మాట్లాడలేదు?
ఆ సభలో ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు ప్రస్తావించలేదు?
గుర్తు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
క్యాపిటివ్ మైన్స్, సెయిల్‌లో విలీనం, నో ప్రైవేటైజేషన్
ఈ మూడింటిపై కేంద్రం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు
ప్రైవేటీకరణ ఆగిపోతుందని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ వైయస్ఆర్‌సీపీ పోరాట ఫలమే
అధికారంలో ఉన్నా కార్మికులకు అండగా నిలబడ్డాం
కార్మికుల పక్షానే వైయస్ఆర్‌సీపీ నిలబడి పోరాడుతుంది
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టీకరణ
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం సంతోషంగానే ఉన్నా, అది అప్పులకే సరిపోదని, ఆ మొత్తంతో స్టీల్ ప్లాంట్ ఏ మాత్రం గట్టెక్కే పరిస్థితి లేదని వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మూడు అంశాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్, ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం, సంస్థను ప్రైవేటీకరించబోం అన్న వాటిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నట్టు కేంద్రం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌సీపీ సిటీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
విడ్డూరంగా సంబరాలు:
విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.25 వేల కోట్ల లోటులో ఉన్న నేపథ్యంలో, కేంద్రం ఇప్పుడు ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీపై కార్మికుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయని కూటమి నేతలు, ఏదో యుద్ధం గెల్చినట్లు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. సగానికి సగం తగ్గిన కార్మికులతో 7.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను పూర్తి కెపాసిటీతో నడపడం సాధ్యమయ్యే పనికాదు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే సొంత గనులు (క్యాపిటివ్ మైన్స్) కేటాయించాలి. అలాగే సంస్థను సెయిల్‌లో విలీనం చేయాలి. మూడేళ్లు ట్యాక్స్ హాలీడే ప్రకటించాలి.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. పీకల్లోతు కష్టాలు, నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఆక్సిజన్‌గా పని చేస్తుందని భావిస్తున్నాం. అంతేతప్ప సంస్థ కష్టాలు తీరిపోవు. సంస్థ కార్మికుల మాట కూడా ఇదే. 7.2 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ఈ ప్లాంట్ ఇప్పుడు కేవలం 4.2 మిలియన్ టన్నుల కెపాసిటీతోనే పని చేస్తోంది. 20 వేల మంది ఉద్యోగులకు గానూ, 12 వేల మంది మాత్రమే పని చేస్తున్నారు. వారిలోనూ 4 వేల మంది త్వరలో పదవీ విరమణ చేస్తున్నారు. మరో 1000 మందికి వీఆర్‌ఎస్ ఇవ్వాలని నిర్ణయించారు. వీటన్నింటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ తిరిగి ఎలా నిలబడుతుంది? ఎలా పని చేస్తుంది?.
ఈ ప్యాకేజీ ఏ మూలకు?:
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే రూ.25 వేల కోట్ల లోటును ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్ బకాయి రూ.7 వేల కోట్లు, వాటి కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఆ రుణాలకు వడ్డీలు.. ఉద్యోగులకు బకాయి పడ్డ వేతనాలు రూ.1600 కోట్లు, వీఆర్‌ఎస్ అమలు, వివిధ రకాల బెనిఫిట్స్ అన్నీ కలిపి మరో రూ.1000 కోట్లు. ఇవన్నీ కలిపి దాదాపు రూ.25 వేల కోట్లు అవసరం. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ ఏ మూలకు సరిపోతుంది?.
నిజంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణ ఆపుతున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలి. కానీ, ప్రభుత్వం ఆ పని చేయకపోవడం, పలు అనుమానాలకు తావిస్తోంది. కేంద్రం ప్రకటించిన సాయం మొత్తం అప్పులకే సరిపోకపోతే ప్లాంట్‌ను ఎలా నడపాలి.
ప్యాకేజీపై అనుమానాలు:
కేంద్ర ప్రకటన మేరకు గత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ప్లాంట్ ఆస్తుల విలువ రూ.7600 కోట్లు కాగా, అప్పులు రూ.25 వేల కోట్లు. ఈ నేపథ్యంలో మాకున్న సమాచారం ప్రకారం, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో నాలుగు నెలల క్రితం ఇచ్చిన రూ.500 కోట్లు, ప్లాంట్ ఖర్చు చేసిన కార్మికుల సొమ్ము రూ.1,100 కోట్లు.. వెరసి మొత్తం రూ.1,600 కోట్లు మినహాయించుకుని రూ.9,800 కోట్లు మాత్రమే ఇస్తారని తెలుస్తోంది.
ఇంకా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో రూ.10,300 కోట్లు ఈక్విటీ కింద, ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద రూ.1,140 కోట్లు ఇస్తామని చెప్పారు. అంటే, ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద ఇచ్చిన నిధులను ఐదేళ్లలోనో, పదేళ్ల తర్వాతనో తిరిగి కట్టేసే బాధ్యత ప్లాంట్ తీసుకోవాలి. అందుకే కేంద్ర ప్యాకేజీపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
ప్రైవేటీకరణను అడ్డుకున్నది వైయస్ఆర్‌సీపీనే:
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని 2021, జనవరి 21న ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, అప్పుడు మా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి నుంచి మా ప్రభుత్వం, ఆ తర్వాత మా పార్టీ ఎప్పుడూ ప్లాంట్ కార్మికులకు అండగా నిలబడింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యతను సీఎంగా వైయస్ జగన్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని నిన్నటి ప్రెస్ బ్రీఫింగ్‌లోనూ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టంగా చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, 2021 మే నెలలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. మా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నాం.
కూటమి ప్రభుత్వం ఏం చేసింది?:
కూటమి అధికారంలోకి వచ్చాక గడిచిన ఏడు నెలలుగా స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కార్మికులకు మూడు నెలలుగా జీతాల్లేవు. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కట్ ఏశారు. ప్లాంట్ పూర్తి స్థాయి కెపాసిటీతో నడవడం లేదు.
చివరకు మొన్న జనవరి 8న విశాఖలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న బహిరంగ సభలో కూడా.. ఆయన కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ.. స్టీల్ ప్లాంట్‌పై కనీసం నోరు మెదపలేదు. ఆ సభలో పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం.. ముగ్గురూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ ప్యాకేజీ వెనక ఏదో మతలబ్ ఉందనిపిస్తుంది.
నిజంగా చిత్తశుద్ధి ఉంటే..:
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అటు కేంద్రానికి, ఇటు కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్ కేటాయించాలి. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటించాలి. నిరుపయోగంగా ఉన్న దాదాపు 10 వేల ఎకరాలు ప్లాంట్ భూములు రాష్ట్రపతిగారి పేరు మీద ఉన్నాయి. వాటిని తక్షణం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్)పేరు మీదకు మార్చాలి. అలా చేస్తే ప్లాంట్ విలువ మైనస్ నుంచి రూ.70 వేల కోట్లకు పెరుగుతుంది.
ఇంకా ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ వివిధ పన్నుల రూపంలో రూ.55 వేల కోట్లు చెల్లించింది. అందుకే గడిచిన మూడేళ్లకు సంబంధించి ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి. ఆ విధంగా దాదాపు రూ.10 వేల కోట్లకు వెసులుబాటు కలుగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వివరించారు.