Best Web Hosting Provider In India 2024
Kakatiya University : కె-హబ్‌లో ముందుకు సాగని పరిశోధనలు.. పది నెలలైనా తెరుచుకోని తాళాలు!
Kakatiya University : కాకతీయ యూనివర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించాలని సంకల్పించారు. వివిధ ఆవిష్కరణలకు ఉపయోగపడేందుకు ‘కె–హబ్’ను ఏర్పాటు చేశారు. కానీ.. అది ఇంతవరకు తెరచుకోవడం లేదు. ఫలితంగా కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) ఫండ్స్ రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కాకతీయ యూనివర్సిటీలో కె-హబ్‌ను నిర్మించారు. దాదాపు ఏడాదిన్నర కిందటే పనులన్నీ పూర్తయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని ప్రారంభించడంలో నిర్లక్ష్యం చూపింది. గవర్నమెంట్ మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, స్థానిక నేతలంతా కలిసి ఆర్భాటంగా ‘కె–హబ్’ను ప్రారంభించారు.
ప్రారంభించి 10 నెలలు..
దానిని ప్రారంభించి పది నెలలవుతున్నా కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఇంతవరకు దాని తాళాలు తీసిన పాపాన పోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ‘కె–హబ్’ నిర్మాణం, అందులో పరికరాల కోసం రూసా ఫండ్స్ రూ.50 కోట్లు రిలీజ్ అయ్యాయి. కానీ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి యూనివర్సిటీ అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలు గడుస్తున్నా ఆవిష్కరణల వైపు అడుగులు వేయడం లేదు. తాళాలతోనే దర్శనమిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం..
రూసా ఫండ్స్‌తో ‘కె–హబ్’ నిర్వహణకు సొంత భవనం, ప్రాజెక్టులకు సంబంధించిన పరిశోధన కేంద్రాలు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇందుకు మొదట విడతగా 2020లోనే రూసా రూ.15 కోట్లు విడుదల చేసింది. దీంతో తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.6 కోట్లతో ‘కె–హబ్’ బిల్డింగ్ పనులు చేపట్టారు. 2022లోనే పనులు పూర్తయ్యాయి. కానీ అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దగా పట్టించుకోక కె–హబ్ ఓపెనింగ్‌కు నోచుకోలేదు.
పరిశోధనలకు దూరం..
గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం, విద్యార్థులు పరిశోధనలకు దూరమవుతుండటంతో.. సమస్యను ఇక్కడి విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కె–హబ్ లో ఇంటర్నల్ వర్క్స్ అన్నీ పూర్తి చేశారు. ఆ తరువాత 2024 మార్చి 10వ తేదీన వరంగల్ నగర పర్యటనకు వచ్చిన పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర నేతలంతా కలిసి ‘కె–హబ్’ను ప్రాంభించారు. అనంతరం వర్సిటీ అధికారులు కె–హబ్‌కు తాళాలు వేసి పెట్టారు.
ఎన్నో పరిశోధనలు..
కె–హబ్ ఏర్పాటు కోసం రూసా ఫండ్స్ రూ.50 కోట్లు రిలీజ్ చేయగా.. అందులో రూ.6 కోట్లతో బిల్డింగ్, రూ.9 కోట్లను మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. రూ.23 కోట్లతో సెంటర్ ఫర్ డ్రగ్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్, సెంటర్ ఫర్ నానో డ్రగ్ డెలివర్సీ సిస్టమ్స్, సెంటర్ ఫర్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్ ఫిజిక్స్, తదితర పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
నిధుల కేటాయింపు ఇలా..
మిగతా రూ.12 కోట్లను యూనివర్సిటీ టీచర్ల వ్యక్తిగత పరిశోధనకు కోసం ఖర్చు చేయాలి. కె–హబ్ వినియోగంలోకి వస్తే అర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సైబర్ సెక్యూరిటీ, ఫార్మా స్యూటికల్ సైన్స్, రోబోటిక్స్, జియోలాజికల్ సైన్స్, తదితర రంగాల్లో పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. యూనివర్సిటీతో పాటు ఇతరుల పరిశోధనలకు కూడా ఇదే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉపయోగపడుతుంది.
అధికారుల తీరుపై విమర్శలు..
కె–హబ్, పరిశోధనల కోసం ఫండ్స్ రిలీజ్ అయినా.. యూనివర్సిటీ అధికారులు మాత్రం దానిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. యూజీసీ ఆఫీసర్లు, కేయూ అధికారుల సమన్వయంతో కంబైన్డ్ మీటింగ్ నిర్వహించి, కె–హబ్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇక్కడి అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉంది. కాకతీయ యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కె–హబ్ తెరచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ అధికారులు తగిన చర్యలు చేపట్టి.. కాకతీయ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన కె–హబ్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని.. విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్