Best Web Hosting Provider In India 2024
CM Chandrababu : ఈ నెలాఖరులో వాట్సాప్ గవర్నెస్, ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు- సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగు వాడి ఆత్మగౌరవం అని సీఎం చంద్రబాబు అన్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామన్నారు.
CM Chandrababu : “అమరావతిని గట్టెక్కించే పరిస్థితికి వచ్చాం. పోలవరానికి ప్రాణం పోస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్లు ఇచ్చి కేంద్రం ఆదుకుంది. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం వల్లే సాధ్యమవుతున్నాయి” అని సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ…ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు. తెలుగు వాడి ఆత్మ గౌరవం, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.. బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం అన్నారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్ అన్నారు. బీసీలకు మొట్టమొదటిసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్, రాయలసీమకు సాగు నీరు, తాగు నీరు అందించిన భగీరథుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు.
“ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తాం. ఈ నెలాఖరులోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు. చాలా వరకూ మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పనిలేదు. మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నాం”- సీఎం చంద్రబాబు
టీడీపీ కుటుంబం ఇప్పుడు ఒక కోటి అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జనరల్ సెక్రటరీగా నారా లోకేశ్, కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. రూ.130 కోట్లు కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు పెట్టారన్నారు. కోటి మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. గత 5 ఏళ్లు కడపలో ఏం జరిగిందో చూశారని, ఇప్పుడు ఈ 5 ఏళ్లు కడపను కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తుందో చూస్తారన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. అప్పుడే అభివృద్ధి ముందుకు వెళ్తుందన్నారు.
సీమ రైతాంగం మీసం తిప్పే రోజులు దగ్గర్లోనే
నీటి నిర్వహణ సరిగ్గా చేశాం కాబట్టే, ఈ ఏడాది రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజులు తీసుకొస్తామన్నారు. పోలవరం నుంచి 200-300 TMC నీరు సీమకు తీసుకుని వస్తే, రాయలసీమకు ఇక తిరుగు ఉండదన్నారు. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదాట్లో ముంచేసిందని విమర్శించారు. ఈ రోజే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం మొదలు పెట్టామని, ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామన్నారు.
“ఏపీ జీవనాడి పోలవరం. 4 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. నేను ముందస్తు జాగ్రత్తలు తీసుకొని రాయలసీమలో ప్రాజెక్టులను నీటితో నింపాను . పోలవరం నుంచి 300 టీఎంసీల నీరు సీమకు వస్తే ఇక్కడ ప్రగతి పరుగులు పెడుతుంది. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో ముంచేసింది. రూ. 12,157 కోట్లు కేంద్రం ఫేజ్ వన్ కింద ఇవ్వడంతో డయాఫ్రం వాల్ ప్రారంభించాం. రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం. ఇప్పటికే పోలవరం కృష్ణా అనుసంధానం చేశాం. కృష్ణా డెల్టాలో వాడే నీరు శ్రీశైలం ద్వారా సీమకు అందించాం. రాబోయే రోజుల్లో పోలవరం-బనకచర్ల అనుసంధానం చేయగలిగితే గేమ్ ఛేంజర్ అవుతుంది. బనకచర్ల వరకూ నీరు తీసుకురావడం నా జీవితాశయం” అని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేయూత
“కేంద్ర సాయంతో ఏపీ అభివృద్ధి పట్టాలెక్కింది. ఏపీ ప్రజలు 21 పార్లమెంటు సీట్లు గెలిపించారు. వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందించింది. అమరావతి పనులు జరుగుతున్నాయి. పోలవరం పనులు వేగవంతయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ వచ్చింది. రూ. 50 వేల కోట్ల వ్యయంతో జాతీయ రహదారులను మూడేళ్లలో పూర్తిచేస్తాం. రూ. 70 వేల కోట్లతో రైల్వే లైన్లు వేస్తున్నారు. 12.94 శాతం వృద్ధి రేటు సాధించాము. దీన్ని 15 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. టీడీపీకి ఒక చరిత్ర ఉంది. నేషనల్ ఫ్రంట్ ను ఎన్టీఆర్ ను అధికారంలోకి తెచ్చారు. ఎన్డీఏ కన్వీనర్ గా నేను ఇద్దరు ప్రధానుల నియామకంలో ముఖ్యపాత్ర పోషించాను. ఎన్డీఏ వన్ లో వాజ్ పేయి గారికి సహకరించి సమైక్యాంధ్రను అభివృద్ధి చేశాము. ఎన్డీఏ 2 లో ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేశాము. ఇప్పుడూ పనిచేస్తున్నాము. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది. తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం”– సీఎం చంద్రబాబు
లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్
వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి…సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. టీడీపీలో మూడో తరం నేతగా ఉన్న లోకేశ్ డిప్యూటీ సీఎం హోదాలో చూడాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తు్న్నాయన్నారు. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేస్తే పార్టీలోని యువతకు భరోసా ఉంటుందన్నారు. దీనివల్ల పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్