Best Web Hosting Provider In India 2024
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ బోర్డు కీలక నిర్ణయం.. బస్టాండ్లు, డిపోల అభివృద్ధి భారీగా నిధులు
TGSRTC : తెలంగాణలో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో బస్టాండ్లు రద్దీగా మారుతున్నాయి. అటు మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాండ్లు, బస్ డిపోలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందుకోసం భారీగా నిధులు కేటాయించింది.
రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశమైంది. కొత్త డిపోలు, బస్ స్టేషన్‌లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రద్దీకి అనుగుణంగా బస్టాండ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
9 ప్రాంతాలకు లబ్ధి..
1.పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లిలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.11.70 కోట్లు కేటాయిస్తూ బోర్డు అనుమతులు ఇచ్చింది.
2.ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.6.28 కోట్లు కేటాయిస్తూ అనుమతులు వచ్చాయి.
3.ములుగు జిల్లా ములుగులో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.11 కోట్లు కేటాయిస్తూ బోర్డు అనుమతులు ఇచ్చింది.
4.సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కొత్త బస్ స్టేషన్ కోసం రూ. 3.75 కోట్లు కేటాయిస్తూ.. ఆర్టీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
5.ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం.. రూ.10.00 కోట్లు కేటాయించారు.
6. ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 51.00 లక్షలు కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
7.పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం రూ.95.00 లక్షలు కేటాయిస్తూ.. అనుమతులు వచ్చాయి.
8. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం.. రూ. 17.95 కోట్లు కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
9. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం, రాబోయే సరస్వతి పుష్కరాల దృష్ట్యా.. ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది.
విస్తరిస్తాం..
ఈ సందర్బంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు.. ప్రస్తుతమున్న 97 డిపోలు, బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని.. అందుకు అనుగుణంగా కొత్త బస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు.. ఉన్నవాటిని విస్తరిస్తామని స్పష్టం చేశారు.
పనులు వేగంగా..
‘రాష్ట్ర ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నాం. అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం. బోర్డు అనుమతి లభించిన నూతన డిపోలు, బస్ స్టేషన్ల పనులు త్వరతిగతిన పూర్తి చేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
టాపిక్