నిరుపేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారు

Best Web Hosting Provider In India 2024

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆక్షేపణ

ఒక్క ఇంటి పట్టా రద్దు చేసినా ఊరుకోం

టీజేఆర్‌ సుధాకర్‌బాబు వార్నింగ్‌ 

ఏ హక్కుతో పట్టాలను రద్దు చేస్తున్నారో చెప్పాలి

టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టే కుట్ర జరుగుతోంది

ఎంతసేపటికీ పేదవారిపైనే చంద్రబాబు ప్రతాపం 

వేలల్లో కేసులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధమవ్వాలి

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టీకరణ

వైయ‌స్ జగన్‌గారికి పేరొస్తుందనే ఇళ్ల పట్టాల రద్దుకు నిర్ణయం 

చంద్రబాబు ఏనాడూ పేదలకు సెంటు భూమి పంచలేదు

జగనన్న కాలనీలతో రూ.1.50 లక్షల కోట్ల సంపద సృష్టి

వాటిపైనా చంద్రబాబు కుట్ర. నిరు పేదలకు అన్యాయం

ప్రెస్‌మీట్‌లో సుధాకర్‌బాబు ధ్వజం

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను రద్దు చేసే హక్కు సీఎం చంద్రబాబుకి లేదని, ఒకవేళ చంద్రబాబు మూర్ఖంగా ముందుకెళితే వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు హెచ్చరించారు. రద్దు చేసిన ఇళ్ల పట్టాలను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే కుట్ర జరుగుతోందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. లబ్ధిదారుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ నిలబడి పోరాడుతుందని వెల్లడించారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు సుధాక‌ర్‌బాబు మీడియాతో మాట్లాడారు. 

పేద‌వారిపై మ‌రో పిడుగుపాటు:
మంత్రివర్గ సమావేశం జరుగుతుందంటే ప్రభుత్వం మనకేదైనా మంచి చేసే కార్యక్రమానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఎదురు చూస్తారు. కానీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇళ్ల పట్టాల రద్దు రూపంలో పేదవారిపై మరో పిడుగుపాటు లాంటి నిర్ణయం తీసుకుంది. 
– చంద్రబాబు గత పాలన చూస్తే మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏనాడూ పేదవారికి సెంటు భూమి పంచిన దాఖలాలు లేవు. దాని మీద ఎప్పుడైనా చర్చకు సిద్ధం. 

వాటి ద్వారా రూ.1.50 లక్షల కోట్ల సంపద:
– వైయ‌ జగన్‌ సీఎంగా చేసిన ఐదేళ్లలోనే 71,811 ఎకరాల భూమిని 30.06 లక్షల మంది పేదవారి కోసం ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. 
– పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఆశయంతో రూ.15,364 కోట్లు వెచ్చించి 25,374 ఎకరాలను ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదే విధంగా అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా (ఏఎమ్మార్డీఏ) నుంచి 1074.18 ఎకరాలను రూ.966.76 కోట్లు, టిడ్కో భూములు 2,550.96 ఎకరాలు రూ.2,295.86 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. 
– ఇవన్నీ కలిపితే 71,811.49 ఎకరాల భూమి ద్వారా దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రూ.56,102.91 కోట్లు విలువైన ఆస్తిని జగన్‌గారు పేద ప్రజల చేతుల్లో పెట్టారు. ఏ పార్టీకూడా ఇంత పెద్ద మొత్తంలో పేదల ఇళ్ల స్థలాలకు అంత భూమి పంపిణీ చేయలేదు. 
– గతంలో దివంగత వైయ‌స్ఆర్ గారు 3 లక్షల ఎకరాల సాగు భూమిని ఎస్సీ ఎస్టీలకు పంచి చరిత్ర సృష్టిస్తే, ఆయన తనయుడిగా వైయ‌స్‌ జగన్‌ పేద ప్రజలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టి చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించారు.   

శరవేగంగా కాలనీల నిర్మాణం:
– ఎన్నికలయ్యే నాటికి చూస్తే 35 నుంచి 40 శాతం మంది ఇళ్లను నిర్మించుకున్నారు. సగటున ఒక్కో ఇంటి పట్టా  విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. పట్టాల పంపిణీ పూర్తయి కాలనీలుగా మారిన తర్వాత మొత్తం ఇళ్ల స్థలాలు, కాలనీల మార్కెట్‌ విలువ దాదాపు రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. అది వైయ‌స్ జగన్‌గారు రాష్ట్రంలో సృష్టించిన సంపద.
– కేవలం ఇళ్ల పట్టాలు ఇచ్చి వదిలేయకుండా సైడ్‌ డ్రైన్లు, రోడ్లు, లైట్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులతో అన్ని మౌలిక వసతులు కల్పించి సుందరమైన కాలనీలుగా తీర్చిదిద్దారు. అలా లేఅవుట్లలో 17,005 కాలనీలు రూపుదిద్దుకున్నాయి. 
– ఇళ్లు నిర్మించుకునే వారి కోసం కిటికీ ఫ్రేమ్‌లు, ఇతర ఎలక్ట్రిక్, శానిటరీ సామాన్ల రూపంలో రూ.40 వేలు, రూ.55 వేల విలువైన 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేశాం. 

లబ్ధిదారుల్లో 80 శాతం వారే:
– పేదవాళ్లకు మంచి చేసే విషయంలో వైయ‌స్ జగన్‌గారు ఏనాడూ స్వార్థపూరితంగా వ్యవహరించ లేదు. లబ్ధిదారులు టీడీపీ, జనసేన వాళ్లు ఉన్నారని తెలిసినా అర్హతే ప్రామాణికంగా పట్టాలు పంపిణీ చేశారు. అర్హత లేకపోతే, చివరికి మంత్రి కోరుకున్నా పట్టా పంపిణీ చేయడం సాధ్యం కాలేదంటే మా ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. 
– ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో 20 శాతం ఎస్సీలు, 6 శాతం ఎస్టీలు, 54 శాతం బీసీలున్నారు. ఇతర కులాల వారు 21శాతం ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే 80 శాతం ఉన్నారు. 
– కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు, పూర్తి పారదర్శకంగా, ఎక్కడా రాజకీయ ప్రమేయం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని ఇళ్ల పట్టాల కోసం పంపిణీ చేయడం జరిగింది. 

టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టే కుట్ర:
– పేదల కోసం మంచి చేసే ఇంత మంచి కార్యక్రమం చేపడితే కొత్తగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దాన్ని కొనసాగించాలి. కొత్తగా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించడం పక్కనపెట్టి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు చేస్తామనడం దుర్మార్గం. 
– తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టే పన్నాగం కాకపోతే, ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందో చెప్పాలి. 
– లబ్ధిదారుల నుంచి పట్టాలను వెనక్కి లాక్కోవడానికి ప్రభుత్వానికి ఏం హక్కుంది. ఇది పౌర హక్కుల ఉల్లంఘనే అవుతుంది. త్వరలో ఈ ప్రభుత్వం వేల కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. 

ఒక్క పట్టా రద్దు చేసినా ఊరుకోం:
– రాజధాని ప్రాంతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం 54 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని, పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది. 
– వైయ‌స్‌ జగన్‌ హయాంలో చేసిన మంచి కార్యక్రమాలను అడ్డుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. 
– ఏ ఒక్క లబ్ధిదారుడి ఇంటి పట్టాను రద్దు చేసినా వైయ‌స్ఆర్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోదు. బాధితుల పక్షాన నిలబడి పోరాడుతుంది. 

జగన్‌కి పేరొస్తుందనే భయం:
– జగనన్న పేరుందనే కారణంతో, నిర్మాణాలు పూర్తయితే ఆయనకు మంచి పేరొస్తుందనే భయంతోనే పట్టాలు రద్దు చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన ఏడు నెలల కాలంలో ఏనాడూ పేదల ఇంటి నిర్మాణాలపై కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. 
– వైయ‌స్ జగన్‌కి మంచి పేరొస్తుందనే భయంతోనే జగనన్న కాలనీల్లోకి, గ్రామ సచివాలయాల్లోకి, నాడు నేడు ద్వారా రూపుదిద్దుకున్న స్కూళ్లలోకి వెళ్లలేకపోతున్నారు. 
– మా ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రబాబు ఆ ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారు.
– గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ వద్దనుకుంటే ఆ మాటను బహిరంగంగా కూటమి నాయకులు చెప్పాలి. 

అమరావతిలో అసైన్డ్‌ భూములు వెనక్కి తీసుకోగలరా?:
– పేదవారి ఇళ్ల పట్టాలను లాక్కునే బదులు అమరావతి రాజధానిలో అసైన్డ్‌ భూములు కాజేసిన వారి నుంచి లాక్కుని వాటిని తిరిగి ఎస్సీ ఎస్టీలకు అప్పగించాలి. వేలాది ఎకరాలు భోంచేసిన తిమింగలాలను గుర్తించి వారి నుంచి భూములు స్వాధీనం చేసుకోవాలి.   
– రాజధాని ప్రాంతంలో 1336 మందికి బినామీల పేరుతో 1100 ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయని కోర్టులో కేసు నడుస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌లో వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్టు చూపించి భారీ మోసానికి పాల్పడ్డారు.
– ఆ భూములన్నీ పేదలైన ఎస్సీ ఎస్టీల నుంచి లక్షలు ఇచ్చి తీసుకుని, వాటినే పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చి కోట్లల్లో లబ్ధి పొందారు. చంద్రబాబుకి దమ్ముంటే ఆ భూములను నిజమైన లబ్ధిదారులకు తిరిగి అప్పగించాలి. 
– ఫ్రీ హోల్డింగ్‌ పేరుతో అసైన్డ్‌ భూములను అమ్ముకునే హక్కు లబ్ధిదారులకి మాత్రమే ఉండేలా వైయ‌స్‌ జగన్‌ సీఎంగా సంస్కరణలు చేపడితే చంద్రబాబు దానిని కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు.  
– 9 లక్షల ఎకరాలను 22–ఏ నుంచి తొలగించి సర్వహక్కులను అసలు హక్కుదారుడికి అప్పగించిన ఘనత గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిది. ఈ కార్యక్రమం ద్వారా 25 లక్షల మంది రైతులకు మేలు జరిగింది.
– ఇప్పుడు ఆ భూములపై తెలుగుదేశం కార్యకర్తలు వాలిపోయి బెదిరింపులతో వాటిని లాక్కునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  
– అసైన్డ్‌ ల్యాండ్‌ చట్టాన్ని సవరించడంలో తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో దమ్ముంటే చెప్పాలని సుధాకర్‌బాబు సవాల్‌ చేశారు.

Best Web Hosting Provider In India 2024