Best Web Hosting Provider In India 2024
Mad Square: బాక్సాఫీస్ వద్ద నితిన్ vs నితిన్.. క్రేజీ సీక్వెల్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్.. వీరమల్లు వాయిదానేనా!
Tollywood: మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. భారీ క్రేజ్ ఉన్న ఈ క్రేజీ సీక్వెల్ మూవీ విడుదల తేదీని టీమ్ అధికారికంగా ప్రకటించింది. రాబిన్‍హుడ్ చిత్రంతో ఇది బాక్సాఫీస్ వద్ద తలపడనుంది.
కామెడీ మూవీ ‘మ్యాడ్’ సెన్సేషనల్ హిట్ అయింది. 2023 అక్టోబర్ 6న రిలీజైన ఈ సినిమా అంచనాలకు మించి అదరగొట్టింది. కాలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో క్రేజీ కామెడీతో రూపొందిన ఈ చిత్రం యూత్‍ను అలరించి ఫుల్‍గా కనెక్ట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ సినిమా సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ కు ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంది. ఎప్పుడు వస్తుందా అనే నిరీక్షణ నెలకొంది. ఎట్టకేలకు మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
రిలీజ్ డేట్ ఇదే
మ్యాడ్ స్క్వేర్ సినిమా ఈ ఏడాది మార్చి 29వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు (జనవరి 18) అధికారికంగా ప్రకటించింది. “మీరు భరించే దాని కంటే ఎక్కువ ఫన్. మీరు ఊహించేదాని కంటే ఎక్కువ మ్యాడ్‍నెస్. ఎంటర్‌టైన్‍మెంట్ గేమ్‍ను నెక్స్ట్ లెవెల్‍కు తీసుకెళ్లేందుకు మార్చి 29 నుంచి థియేటర్లలోకి మ్యాడ్ స్క్వేర్ వచ్చేస్తుంది” అని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్ మూవీని ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‍మెంట్‍తో అతడు తెరకెక్కించారు. సీక్వెల్ కూడా అంతకు మించి ఉంటుందనేలా మూవీ టీమ్ హింట్స్ ఇస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన స్వాతి రెడ్డి సాంగ్ మోతమోగిపోతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.
మ్యాడ్ స్క్వేర్ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‍లో ఉన్నాయి. సీక్వెల్‍లోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నితిన్ vs నితిన్
నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్‍హుడ్’ చిత్రం కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వెంకీ కుడుముల దర్శకత్వ వహిస్తున్న ఈ మూవీని మార్చి 28వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ నేడు వెల్లడించింది. నార్నే నితిన్ లీడ్ రోల్ చేసిన మ్యాడ్ స్క్వేర్ ఒక్క రోజు తర్వాత మార్చి 29న విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రాబిన్‍హుడ్, మ్యాడ్ స్క్వేర్ తలపడనున్నాయి. నితిన్ వర్సెస్ నితిన్ పోటీ ఉండనుంది.
‘హరి హర వీరమల్లు’ వాయిదానే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమా మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. ఇటీవలే మాట వినాలి పాట రాగా.. అందులోనూ రిలీజ్ డేట్ ఉంది. అయితే, సడెన్‍గా ఆ డేట్‍లో రాబిన్‍హుడ్ వచ్చేందుకు రెడీ అయింది. మ్యాడ్ స్క్వేర్ కూడా అప్పుడే వస్తోంది. దీంతో హరి హర వీరమల్లు సినిమా వాయిదా పడుతుందని, ఆ క్లారిటీతోనే ఈ రెండు చిత్రాలు ఆ తేదీలు ఫిక్స్ చేసుకున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి వీరమల్లు టీమ్ ఈ విషయం త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
సంబంధిత కథనం