Best Web Hosting Provider In India 2024
TG Ration Cards : కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేదా? మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు- మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
TG Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల జాబితాలు సిద్ధం అయ్యాయి. అయితే జాబితాల్లో పేర్లు లేనివారు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేర్లు లేని వారు గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
TG Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుల జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు జారీ చేస్తామని స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ…అలాంటిదేమీ ఉండదన్నారు. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
పాత రేషన్ కార్డులు తొలగించం
కొత్త రేషన్ కార్డుల జారీపై గ్రామాల్లో అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన జాబితాలు విడుదల చేస్తున్నారు. ఈ జాబితాల్లో తమ పేర్లు లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హత కలిగిన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇచ్చారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని, వాటిలో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పుకొచ్చారు. ఇకపై రేషన్ కార్డులు పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. జాబితాల్లో తమ పేర్లు లేవని పలు గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి హామీతో వీరికి మరో అవకాశం దొరికినట్టయింది.
జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలుకానుంది. రేషన్ కార్డుల పంపిణీకి గ్రామాల్లో సర్వే వేగవంతంగా జరుగుతోంది. తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల మందికి…90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు అర్హత కలిగిన వారు సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పష్టం చేశారు.
రేషన్ కార్డులపై మొదలైన రగడ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇటీవలే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు గ్రామ, బస్తీ సభలు నిర్వహించి, అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది జాబితా ఖరారవుతుందని అధికారులు చెబుతున్నారు.
కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌరసరఫరాల శాఖ కార్డులను మంజూరు చేయనుంది. జనవరి 26న కొత్త కార్డుల జారీ ప్రారంభం కానుంది. అయితే.. ప్రస్తుతం వచ్చిన జాబితా తమ పేర్లు లేవని చాలా గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులను నిలదీస్తున్నారు. దీంతో వారు గ్రామాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
తాజాగా బి.అన్నారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. ‘మేము ఇచ్చాం అప్లికేషన్.. మాకేందుకు రాలేదు రేషన్ కార్డు’ అంటూ ఆ గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఒక్క బి.అన్నారం గ్రామంలోనే కాదు.. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అటు దరఖాస్తు చేసుకున్నవారు గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు.
కొందరు క్షేత్రస్థాయి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి.. జాబితాలో ఉన్నవారి పేర్లను వెల్లడించారు. దీంతో జాబితాలో పేర్లు లేని వారు ఆందోళనలు చేస్తున్నారు. గ్రామ, బస్తీ సభలు నిర్వహించక ముందే జాబితాలోని పేర్లు బయటకు ఎలా వెళ్లాయని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు గ్రామ, బస్తీ సభలు నిర్వహించడానికి భయపడుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్