Best Web Hosting Provider In India 2024
Dy CM Bhatti Vikramarka : రేషన్ కార్డుల లబ్దిదారుల ఎంపిక గ్రామసభల్లోనే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన
Dy CM Bhatti Vikramarka : ఈ నెల 26న మూడు పథకాలు ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు. లబ్దిదారులను గ్రామసభల్లో ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు.
Dy CM Bhatti Vikramarka : ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా అమలుచేస్తున్నామన్నారు. వ్యవసాయ భూములు ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి రూ.12,000, భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12,000 ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.
గ్రామసభల్లోనే ఖరారు
గ్రామసభలలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో రూపొందించకుండా, గ్రామసభలలోనే ఖరారు చేస్తామన్నారు. ఎర్రుపాలెంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. చెరువులు, అడవులను రక్షిస్తూ ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు.
ఇంకా జాబితాలు రెడీ కాలేదు
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎలాంటి జాబితాలు తయారు కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లబ్దిదారుల జాబితా గ్రామాల్లోనే తయారవుతుందని పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భట్టి విక్రమార్క ప్రారభించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రజలందరి సమక్షంలోనే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభలలో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు.
మరోసారి రేషన్ కార్డులు
తెలంగాణలో మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను తీసుకున్నప్పటికీ… వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవలే నిర్వహించిన కుటుంబ సర్వే ఆధారంగా… రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు సర్కార్ ప్రకటించింది. ఈ సర్వే ఆధారంగానే ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసింది. వీటిని పౌరసరఫరాల శాఖ గ్రామాల వారీగా విభజించి విడుదల చేసింది.
ప్రాథమిక జాబితాలు విడుదల కావటంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ పేర్లు లేదని పలువురు వాపోతున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని… అయినా తమ పేర్లు లేదని చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డు జాబితాలు రావటంతో ప్రజల్లో అనేక అపొహాలు నెలకొన్నాయి. అయితే వీటిపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పింది.
సంబంధిత కథనం
టాపిక్