2014 నుంచి 2019 వరకు ఏపీలో విధ్వంసం 

Best Web Hosting Provider In India 2024

చంద్రబాబు సమక్షంలోనే అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు.. అందుకు పూర్తి విరుద్ధంగా పురందేశ్వరి తెలుగు అనువాదం 

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కేంద్ర మంత్రి ప్రసంగం  

అమరావతి: ‘అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 వరకు విధ్వంసం సృష్టించారు. అది మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం (మ్యాన్‌ మేడ్‌ డిజాస్టర్‌). దాంతో ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అభివృద్ధి పూర్తిగా అడుగంటింది’ అని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో చంద్ర­బాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

గన్నవరం మండలం కొండపావులూరులోని ఆదివారం నిర్వహించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి మూడు రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాగా, అమిత్ షా హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం చంద్రబాబు పట్ల స్వామిభక్తి ప్రదర్శించారు. అమిత్ షా ప్రసంగాన్ని తెలుగులోకి అనువదిస్తూ ‘2019 నుంచి ఐదేళ్లపాటు రాష్ట్రంలో జరిగిన విధ్వంసం’ అని మార్చి చెప్పారు.

 అమిత్ షా  2014 నుంచి 2019 వరకు అని స్పష్టంగా ప్రసంగిస్తే… పురందేశ్వరి మాత్రం 2019 నుంచి ఐదేళ్లపాటు అని అనువదించారు. కానీ అమిత్ షా ప్రసంగాన్ని అధికారికంగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) మాత్రం అసలు విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యం సంత­రించుకుంది. ‘2014 నుంచి 2019 వరకు మానవ తప్పిదం సృష్టించిన విధ్వంసంతో ఆంధ్ర­ప్రదేశ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది’ అని అమిత్ షా ప్రసంగించినట్టు ఆ ప్రకటనలో అధికారికంగా పేర్కొంది.

మరోవైపు అమిత్ షా నేరుగా హిందీలో చేసిన ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ మనసులో ఉన్న మాటనే అమిత్ షా చెప్పారని పలువురు వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిందని, అది మానవ తప్పిదంతో జరిగిన విధ్వంసమేనని అమిత్ షా చెప్పారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. 
 

Best Web Hosting Provider In India 2024