Best Web Hosting Provider In India 2024
TTD Darshans: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నేటి నుంచి యథావిధిగా సర్వదర్శనం టోకెన్ల జారీ..
TTD Darshans: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న ఘటన మినహాయిస్తే పది రోజుల పాటు సజావుగా స్వామి వారి దర్శనాలు జరిగాయి. పదిరోజుల్లో దాదాపు 6.58లక్షల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.
TTD Darshans: తిరుమలలో ఆదివారంతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. పది రోజుల్లో మొత్తం 6.58లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. నేటినుంచి యథావిధిగా టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. చివరి మూడు రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారి దర్శనానికి తరలి వచ్చారు. మొదటి ఏడు రోజుల్లో 4.75లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. జనవరి 10 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు.
పది రోజుల్లో 7లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని భావించినా 6.58లక్షల మంది దర్శనం చేసుకున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 26న తిరిగి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు లభించనుంది.
వైకుంఠ ద్వార దర్శనాల్లో రోజుకు 50వేల టోకెన్లను కౌంటర్లలో జారీ చేశారు. శుక్రవారం 42వేల టోకెన్లు, శనివారం 57వేల టోకెనల్లు జారీ చేశారు. పది రోజుల్లో ఆరున్నర లక్షల మందికి ఉత్తర ద్వార దర్శన భాగ్యం లభించింది. ఆదివారం రాత్రి అర్చకులు శాస్త్రో క్తంగా వైకుంఠ ద్వారాలను మూసివేశారు. ఈ నెల 10 నుంచి 19 వరకు వీఐపీ ప్రొటోకాల్, ఆన్లైన్లో రూ.300 ఎస్ఈడీ, ఎస్ఎస్ఓ, శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించారు.
నేటి సర్వదర్శనం ప్రారంభం…
ఆదివారం సాయంత్రం నుంచి టోకెన్లు లేని భక్తులను క్యూ కాంప్లెక్స్ ల్లోకి అనుమతించారు. సోమవారం ఉదయం నుంచి అందరికి సర్వదర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది.
గతంలో మాదిరి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్లు జారీ చేయనున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలి నడకన వెళ్లేవారికి మెట్టు ప్రారంభ స్థానంలో, అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద దర్శనం టిక్కెట్లు జారీ చేస్తారు.
టాపిక్