Best Web Hosting Provider In India 2024
Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‍బస్టర్ ఎఫెక్ట్.. ఫ్యామిలీ సినిమాలు పెరుగుతాయా?
Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలకు మించి సంచలన కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఈ చిత్రం ఎఫెక్ట్ వల్ల టాలీవుడ్‍లో ఫ్యామిలీ డ్రామా సినిమాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఆ వివరాలు ఇవే..
1990లు, 2000ల్లో తెలుగులో కుటుంబ కథా చిత్రాలు లెక్కకు మిక్కిలి వచ్చేవి. ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ బ్యాక్‍డ్రాప్‍లోనే తెరకెక్కేవి. చాలా సినిమాలు భారీ హిట్స్ అయ్యాయి. అయితే, కొన్నేళ్లుగా తెలుగులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ బాగా తగ్గిపోతూ వచ్చాయి. ఏడాదికి వేళ్లపై లెక్కపెట్టుకునే సంఖ్యలోనే ఈ కుటుంబ కథా చిత్రాలు వస్తున్నాయి. ఎక్కువ మంది హీరోలు యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్, హిస్టారిక్, మైథాలజీ చిత్రాలే చేస్తున్నారు. స్కోప్, రీచ్ ఎక్కువగా ఉండటంతో అలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మొత్తంగా టాలీవుడ్‍లో ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో కుటుంబం మొత్తంతో కలిసి థియేటర్లకు వెళ్లే సందర్భాలే తక్కువవుతున్నాయి. గతేడాది 2024లో పక్కా ఫ్యామిలీ సబ్జెక్టుతో పక్కా ఎంటర్‌టైనింగ్ సినిమాలు రాలేదు. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి గత వారం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే వైబ్‍తో అడుగుపెట్టింది. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మూవీ అంచనాలకు మించి కలెక్షన్లతో ఆశ్చర్యపరుస్తోంది.
కుటుంబ ప్రేక్షకులు భారీగా..
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న రిలీజ్ అయింది. పండగకు సూటయ్యేలా కుటుంబ కథాచిత్రంగా అడుగుపెట్టింది. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ టాకే వచ్చింది. కానీ ప్రేక్షకులు మాత్రం తండోపతండాలు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా ఈ మూవీకి వస్తున్నారు. ఆరో రోజు కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమా చానాళ్లకు వచ్చిందనే అభిప్రాయంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి ఓటేస్తున్నారు.
కొన్నేళ్లుగా థియేటర్లకు రానీ వారిని కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రప్పిస్తోందని వెంకటేశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే నిజం కూడా. కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్రానికి అదనపు కుర్చీలు కూడా వేసినట్టు వీడియోలు వైరల్ అయ్యాయి. అంతలా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కథ, లాజిక్‍లు లాంటివి పక్కన పెట్టి కుటుంబంతో కలిసి ఫ్యామిలీ కామెడీని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమాకు ఈ స్థాయిలో బజ్ వచ్చేందుకు పాటలు కూడా ముఖ్యమైన కారణంగా నిలిచాయి.
ఆశ్చర్యపరిచేలా కలెక్షన్లు
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే రూ.160కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. రూ.100 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రూ.200కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అతిత్వరలో దాటడం తథ్యం. ఈ సినిమాకు ఈ రేంజ్‍లో కలెక్షన్లు వస్తాయని హీరో వెంకటేశ్, డైరెక్టర్, నిర్మాతలు దిల్‍రాజు, శిరీష్ కూడా అనుకొని ఉండరు. మోస్తరు హిట్ కొడుతుందనే అనుకొని ఉంటారు. అయితే, అందరి అంచనాలను దాటేసి గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ చిత్రాలను అధిగమించి సంక్రాంతికి వస్తున్నాం సంచలన బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా కాలర్ ఎగరేసింది. ఇతర రెండు చిత్రాలతో పోలిస్తే తక్కువ టికెట్ ధరే ఉన్నా.. వెంకీ మూవీనే కలెక్షన్లలో చాలా ముందుంది. ఆ రేంజ్‍లో ఈ మూవీకి ప్రేక్షకుల సంఖ్య ఉంది.
ఫ్యామిలీ సినిమాలు పెరుగుతాయా?
టాలీవుడ్‍లో ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సినిమాల కొరత ఎంత ఉందో దర్శక నిర్మాతలకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అర్థమై ఉంటుంది. మంచి కంటెంట్‍తో కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా తీసి ఫెస్టివల్ సీజన్‍కు వస్తే ఏ రేంజ్‍లో హిట్ కొట్టొచ్చో తెలిసే ఉంటుంది. కుటుంబ కథా చిత్రాలతోనూ భారీ కలెక్షన్లను రాబట్టొచ్చనే భావన కూడా వస్తుంది. అందుకే టాలీవుడ్‍లో రానున్న రోజుల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ పెరిగే అవకాశం ఉంది. దర్శకుడు కూడా ఈ దిశగా కథలు సిద్ధం చేసుకొని.. సీనియర్ హీరోలకు వినిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొందరు యంగ్ హీరోలు కూడా ఈ ఫార్ములా పాటించొచ్చు. అయితే, టైర్-1 హీరోలు మాత్రం పక్కా ఫ్యామిలీ చిత్రాలు చేసే అవకాశాలు దరిదాపుల్లో లేకపోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం ఎఫెక్ట్‌తో టాలీవుడ్‍లో ఫ్యామిలీ సినిమాల సంఖ్య మళ్లీ పెరుగుతుందేమో చూడాలి.
సంబంధిత కథనం