Best Web Hosting Provider In India 2024
Sharon Raj Murder : ప్రియుడిని నమ్మించి ఇంటికి పిలిచి విషం ఇచ్చి చంపిన ప్రియురాలికి మరణశిక్ష
Sharon Murder Case : 2022లో కేరళలో సంచలనం సృష్టించిన రేడియాలజీ విద్యార్థి షారన్ రాజ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన అతడి ప్రియురాలికి మరణశిక్ష విధించింది.
కేరళలో 2022లో జరిగిన షారన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అతడి ప్రియురాలికి మరణ శిక్ష విధించింది. ఆమెకు సహకరించిన బంధువులకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గ్రీష్మ, షారన్ 2021 నుండి ప్రేమలో ఉన్నారు. వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ మార్చి 2022లో గ్రీష్మా కుటుంబం ఆమెకు మరో సంబంధాన్ని తీసుకొచ్చారు. గ్రీష్మా కూడా ఓకే చెప్పింది.
చంపాలని ప్లాన్
వివాహ ప్రతిపాదనను అంగీకరించిన తర్వాత కూడా కొన్ని రోజులు షారన్‌తో సంబంధాన్ని కొనసాగించింది గ్రీష్మా. ఆ తర్వాత ఎలాగైనా ప్రేమికుడు షారన్‌ను చంపాలనుకుంది. ఇందుకోసం చాలా ప్రణాళికలు వేసింది. పెయిన్‌కిల్లర్ల ప్రభావాలపై ఆన్‌లైన్‌లో బాగా సెర్చ్ చేసేది. షారన్‌కి విషం ఇచ్చేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. నీరు, జ్యూస్‌లలో కలిపి ఇచ్చేందుకు అనేకసార్లు ట్రై చేసింది. ఇవి ఆశించిన ప్రభావాన్ని చూపలేదు.
పెళ్లికి నెల ముందు
మిలటరీ అధికారిని వివాహం చేసుకోవడానికి ఒక నెల ముందు అంటే అక్టోబరు 14, 2022న గ్రీష్మా షారన్‌ని తన ఇంటికి ఆహ్వానించింది. అతనికి జ్యూస్ ఛాలెంజ్ ఇచ్చింది. అందులో విషం కలిపింది. తర్వాత గ్రీష్మా ఇంటి నుంచి బయటకు వచ్చాడు షారన్. కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఆ రాత్రి చాలాసార్లు వాంతులు చేసుకున్నాడు, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాడు.
విషం తాగడంతో మృతి
అక్టోబర్ 25న షారన్ తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో మరణించాడు. తన మరణానికి ముందు గ్రీష్మా దగ్గర జ్యూస్ తాగినట్టుగా స్నేహితుడికి చెప్పాడు. ఆమె తనను మోసం చేసిందని వెల్లడించాడు. ఈ విషయం షారన్ కుటుంబ సభ్యులకు తెలిసింది. తర్వాత అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషం తాగడం కారణంగానే షారన్ మృతి చెందినట్టుగా పోస్టుమార్టం నివేదికలో వచ్చింది.
ప్రియురాలు గ్రీష్మాను విచారణ చేయగా అసలు విషయం ఒప్పుకుంది. విషం ఇచ్చినట్టుగా తెలిపింది. పోలీసులు ఆమెతోపాటుగా ఆమె తల్లి, మామ కూడా నేరాన్ని ప్రోత్సహించి సాక్ష్యాలను నాశనం చేశారనే అనుమానంతో అరెస్టు చేశారు.
అందుకే హత్య
విచారణ సందర్భంగా షారన్‌తో తన సంబంధాన్ని తెంచుకోవాలని అనుకున్నట్టుగా గ్రీష్మా చెప్పిందని పోలీసులు తెలిపారు. సన్నిహితంగా ఉన్నప్పటి దృశ్యాలను వదిలించుకోవాలని ఆమె పథకం వేసిందని పేర్కొన్నారు. తనకు కాబోయే భర్తతో ఫొటోలు, వీడియోలు పంచుకుంటాడని భయపడ్డానని, అందుకే హత్యకు ప్లాన్ చేశానని తెలిపింది.
గ్రీష్మాకు మరణశిక్ష
ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా తనకు శిక్ష తగ్గించాలని న్యాయస్థానాన్ని కోరింది గ్రీష్మా. తాను ఉన్నత చదువులు చదివానని, గతంలో నేర చరిత్ర లేదని కోర్టుకు తెలిపింది. తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెనని చెప్పింది. అయితే న్యాయస్థానం మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఈ కేసు విషయంలో 2023 జనవరి 25 పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 అక్టోబర్ 15 నుంచి మెుదలైన విచారణ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 2న ముగిసింది. జనవరి 20న గ్రీష్మాకు మరణశిక్ష వేస్తున్నట్టుగా కోర్టు తీర్పు వెల్లడించింది.
Best Web Hosting Provider In India 2024
Source link