Best Web Hosting Provider In India 2024
Kantara Prequel: చిక్కుల్లో పడిన కాంతారా ప్రీక్వెల్.. షూటింగ్ అడ్డుకున్న స్థానికులు.. ధ్వంసం చేస్తున్నారంటూ..
Kantara Prequel: కాంతారా ప్రీక్వెల్ మూవీ చిక్కుల్లో పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా పలువురు స్థానికులు అడవులను ధ్వంసం చేస్తున్నారంటూ మూవీ యూనిట్ పై తిరగబడుతున్నారు.
Kantara Prequel: కాంతారా మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా ఛాప్టర్ 1 ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. మూవీ షూటింగ్ పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారంటూ పలువురు అడ్డుపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో జరుగుతోంది.
కాంతారా ఛాప్టర్ 1కి అడ్డంకి..
కాంతారా మూవీ 2022లో రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలుసు కదా. ఈ మూవీకి ప్రీక్వెల్ తీసుకురానున్నట్లు ఈ సినిమా హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి చాలా రోజుల కిందటే అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించాడు.
అయితే ఇండియా టుడేలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఈ కాంతారా ప్రీక్వెల్ చిక్కుల్లో పడింది. షూటింగ్ పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారంటూ పలువురు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గవిగుడ్డ అటవీ ప్రాంతంలోని స్థానిక నేత, జిల్లా పంచాయత్ సభ్యుడు సన్న స్వామి రంగంలోకి దిగారు. ఈ సినిమా షూటింగ్ వల్ల వణ్యప్రాణులు, పక్షులకు కీడు జరుగుతోందని ఆరోపించారు.
“ఏనుగుల దాడుల వల్ల ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అడవులను సంరక్షించాలని సుప్రీంకోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. మరింత నష్టం జరగకముందే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
షూటింగ్కు అడ్డుపడిన స్థానికులు
కాంతారా ఛాప్టర్ 1 షూటింగ్ కు పలువురు స్థానికులు అడ్డుపడుతున్నారు. షూటింగ్ ప్రదేశంలో ఉన్న సిబ్బందితో స్థానికులు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య గొడవలో ఓ యువకుడు గాయపడ్డాడు. అతన్ని సక్లేశ్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవకు సంబంధించి ఇప్పటికే యెసలూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు.
అయితే అడవుల ధ్వంసం ఆరోపణలపై ఇప్పటి వరకూ రిషబ్ శెట్టిగానీ, మేకర్స్ గానీ స్పందించలేదు. కాంతార: ఛాప్టర్ 1 మూవీ ఈ ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. గతేడాది నవంబర్లోనే ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశారు.