Best Web Hosting Provider In India 2024
AP Aadhaar Camps : చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
AP Aadhaar Camps : చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోన్నారు. రెండు విడతలుగా నిర్వహించే ఈ క్యాంపులు.. నేటి నుంచి జనవరి 24 వరకు మొదటి విడతగా జరుగుతాయి. రెండో విడతగా జనవరి 27 నుంచి జనవరి 30 వరకు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 0 నుంచి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు సంబంధించి ఆధార్ నమోదుకు.. ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వివరాలు వెల్లడించింది. తప్పనిసరిగా చిన్నారుల ఆధార్ నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,65,264 మంది చిన్నారులు ఉండగా.. అందులో నేటికీ 9,80,575 మంది చిన్నారులు ఆధార్ నమోదు చేసుకోలేదు.
రెండు విడతల్లో..
ఇప్పుడు నిర్వహించబోయే రెండు విడుదల క్యాంపుల్లో.. వీరందరికీ ఆధార్ నమోదు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే కలెక్టర్లు కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలను పంపించారు. మండలంలో ఉన్న చిన్నారులు ఎంతమంది? అందులో ఎంత మంది ఆధార్ నమోదు చేసుకోలేదనే సమాచారం తయారు చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. దీంతో ఎంపీడీవోలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా, సచివాలయాల ద్వారా డేటాను సేకరిస్తున్నారు. ప్రత్యేక క్యాంపులు ఎక్కడెక్కడ నిర్వహించాలనేదానిపై ప్రణాళిక రూపొందించారు. అందుకునుగుణంగా ఆధార్ క్యాంపులు జరగనున్నాయి.
సంయుక్తంగా క్యాంపులు..
ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపులను గ్రామ, వార్డు సచివాలయ డిపార్ట్‌మెంట్, ఆధార్ ఆపరేటర్స్ సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్, అన్ని జిల్లాల కలెక్టర్లకు, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా ఇన్‌ఛార్జ్‌లకు లేఖ రాశారు. సచివాలయాలు, అంగన్‌వాడీ సెంటర్లు, పోస్టాఫీస్, సీఎస్‌సీ తదితర కేంద్రాల్లో నేటి నుంచి జనవరి 24 వరకు నాలుగు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాలని ఆదేశించారు.
జనవరి 30 వరకు..
రెండో విడుత జనవరి 27 నుంచి జనవరి 30 వరకు.. నాలుగు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాలని ఆదేశించారు. మండల పరిషత్ డవలప్‌మెంట్ ఆఫీసర్లు (ఎంపీడీవో)లు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యమైన అంశాలు..
1. చిన్నారుల ఆధార్ నమోదుకు క్యూర్ కోడ్ ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి.
2. దరఖాస్తు ఫారం ఉండాలి.
3. బిడ్డను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి.
4. వేరెవ్వరూ తీసుకెళ్లాడానికి లేదు.
5. బిడ్డను ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
6. చిన్నారుల ఆధార్ నమోదుకు ఎటువంటి రుసుము లేదు. ఉచితమే.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్