Best Web Hosting Provider In India 2024
Fake Currency in Hundi : కామారెడ్డి జిల్లాలో దొంగనోట్ల కలకలం.. ఆలయం హుండీలో లభ్యం!
Fake Currency in Hundi : కామారెడ్డి జిల్లాలో దొంగనోట్లు కలకలం సృష్టించాయి. ఏకంగా ఆలయం హుండీలో ఫేక్ కరెన్సీ రావడంతో ప్రజలు, పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుమానితులను ప్రశ్నించారు. గతంలోనూ కామారెడ్డి ప్రాంతంలో ఫేక్ కరెన్సీ పట్టుబడింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. మండలంలోని చద్మల్ తండాలోని లక్ష్మమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరిగాయి. భక్తుల కానుకలు, సంఘంలోని నగదు సుమారు కోటి రూపాయల వరకు జమైంది.
స్థానికులకే వడ్డీకి..
చద్మల్ తండా పెద్దల నిర్ణయం మేరకు.. పాతికేళ్లుగా ఆ మొత్తాన్ని స్థానికులకే వడ్డీకి ఇస్తున్నారు. అప్పు తీసుకున్న వారు అసలుతో సహా వడ్డీని ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు ఆలయ కమిటీ సభ్యులకు చెల్లించారు. అలాగే హుండీలోని కానుకలు, ఆలయ కమిటీ నగదును సంఘం కార్యదర్శి గోపాల్ వద్ద ఉంచారు. ఈ నెల 15 నుంచి ఆ నగదును తండా వాసులకు వడ్డీకి ఇచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు..
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు ట్విస్ట్ ఇక్కడే వెలుగులోకి వచ్చింది. వడ్డీకి తీసుకున్న ప్రతి వ్యక్తికి వచ్చిన డబ్బు కట్టల్లో రెండు నుంచి మూడు వరకు నకిలీ నోట్లు బయట పడ్డాయి. దీనిపై కార్యదర్శి గోపాల్‌ను ప్రశ్నించారు. అయితే హుండీలో వచ్చి ఉంటాయని చెప్పి వాటిని మార్చి ఇచ్చారు గోపాల్. కానీ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు అందుపులో ముగ్గురు..
ఈ వ్యవహారంలో మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయని వైరల్ కావడంతో.. కొంత మందిని పిలిపించి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆలయ కమిటీ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బుల్లో రూ.500 నోట్లు నకిలీవి వచ్చాయని.. వెంటనే గాంధారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బాధితులు చెబుతున్నారు.
పెద్ద దందా..
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్జనకు అలవాటు పడినవారు.. ఫేక్ కరెన్సీ చలామణికి కొత్తదారులు వెతుకుతున్నారు. బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో దొంగనోట్లను వాడుకలోకి తెచ్చారు. కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో నకిలీనోట్ల దందా ఎవరికీ తెలియకుండా సాగుతోంది. పోలీసులకున్న అంతర్గత సమాచార వ్యవస్థతో ఈ తంతు గతంలోనే వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నుంచి..
బిచ్కుందలోని ఓ వ్యాపారి దొంగనోట్లు చలామణి చేస్తున్నాడని పోలీసులకు ఇటీవల సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. అతడు ఎవరెవరిని కలుస్తున్నాడు? దొంగనోట్లు ఎలా సమకూర్చుతున్నాడు అనే వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత గుట్టురట్టు చేశారు. అతను హైదరాబాద్ నుంచి బాన్సువాడకు, అక్కడి నుంచి బిచ్కుందకు నకిలీ కరెన్సీ వస్తోందని పోలీసులు గుర్తించారు.
టాపిక్