Best Web Hosting Provider In India 2024
Chittoor : జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఆంధ్రా జవాను మృతి.. ప్రముఖుల సంతాపం
Chittoor : జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏపీకి చెందిన జవాన్ మృతి చెందారు. జవాన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ (మంగళవారం) రాత్రి వరకు మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సహా.. పలువురు సంతాపం తెలిపారు.
జమ్మూకాశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ చనిపోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని ఆర్మీ జవాన్లు చుట్టుముట్టి మెరుపు దాడి చేశారు. ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. దీంతో పంగల కార్తీక్ (32) అనే జవాను బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యం కోసం తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
పదేళ్ల కిందట..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమానుపెంట గ్రామానికి చెందిన వరద మందడి, సెల్వి దంపతులు రెండో కుమారుడు కార్తీక్. అతను పదేళ్ల కిందట ఆర్మీలో చేరారు. వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ అనంతరం.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.
వీర మరణంపై..
కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం.. చినార్ కార్ప్స్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతుడు కార్తీక్ అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది. “చినార్ వారియర్స్.. కార్తీక్ అపారమైన శౌర్యానికి, ధైర్యానికి, త్యాగానికి వందనం చేస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. అతని కుటుంబ సభ్యులకు సంఘీభావంగా ఉంటుంది. ఒక ధైర్యవంతుడి త్యాగం శాశ్వతంగా ప్రతిధ్వనిస్తుంది. రాబోయే తరాలలో ధైర్యాన్ని రగిలిస్తుంది” అని ఎక్స్‌లో పోస్టు చేసింది.
అండగా నిలుస్తాం..
కార్తీక్ త్యాగానికి జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇండియన్ ఆర్మీలోని అన్ని ర్యాంకులు నివాళులర్పిస్తున్నాయని.. ఇండియన్ ఆర్మీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. ఈ దుఃఖ సమయంలో ఇండియన్ ఆర్మీ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందన్నారు.. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని పోస్టు చేశారు. ఇండియన్ ఆర్మీ నార్త్‌ర్న్ కమాండ్, తదితర ఇండియన్ ఆర్మీకి చెందిన విభాగాలు నివాళులర్పించాయి.
త్యాగం మరువలేం..
కార్తీక్ మృతిపట్ల జమ్ముకాశ్వీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నివాళులర్పించారు. “మన సైన్యం ధైర్యసాహసాలు, పంగల కార్తీక్ త్యాగానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. అతని శౌర్యం, త్యాగం ఎప్పటికీ మరచిపోలేము. ఈ దుఃఖ సమయంలో మొత్తం దేశం అమరవీరుడి కుటుంబానికి అండగా నిలుస్తుంది” అని లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యానించారు.
తల్లిదండ్రుల కన్నీరు..
కార్తీక్ మరణ వార్త తెలిసిన వెంటనే తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎగువ రాగిమానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అయ్యారు. కార్తీక్ మృతదేహాన్ని ఆర్మీకి చెందిన ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారని తెలుస్తోంది. బుధవారం గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్