కూటమి పాలనలో అడ్డగోలుగా ఫీజుల దోపిడీ 

Best Web Hosting Provider In India 2024

విద్యార్థులపైనా రెడ్‌బుక్‌ రాజ్యాంగం చూపుతారా?

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ధ్వజం

ఫీజుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులకు వేధింపులు 

ఐఐటీ, జేఈఈ, నీట్‌ పేరుతో ఫీజులు 40 శాతం పెంపు

నారాయణ, చైతన్య కాలేజీల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు

ఇంటర్మీడియట్‌ బోర్డును నారాయణ ఆఫీసుగా మార్చేశారు

ఎ.రవిచంద్ర ఆక్షేపణ

రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు కమిటీయే లేదు 

తక్షణమే ఆ విద్యా సంస్థలు ఫీజుల దోపిడి ఆపాలి

దోపిడి ఆపకపోతే వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఉద్యమిస్తాం 

ప్రెస్‌మీట్‌లో ఎ.రవిచంద్ర హెచ్చరిక

తాడేపల్లి: ఫీజుల పేరుతో నారాయణ, చైతన్య కాలేజీలు ఇష్టారాజ్యంగా విద్యార్థులను వేధించడమే కాకుండా కనీసం క్యాంపస్‌లో అడుగు పెట్టనీయకుండా గేటు బయటకు తోసేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు ఏకంగా 40 శాతం పెంచారని, అక్రమ వసూళ్లను నియంత్రించడానికి కమిటీని ఏర్పాటు చేయాలన్న కనీస జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోయిందని ఆయన గుర్తు చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బాధిత విద్యార్థుల తరఫున కాలేజీల వద్ద  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ర‌విచంద్ర మీడియాతో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం రావడంతోనే..:
– మార్చిలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నాయి. 
– కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో, నారాయణ మంత్రి అయ్యాక ఆ  కాలేజీల అరాచకాలు మరింత పెరిగిపోతున్నాయి. ఫీజులు ఏకంగా 40 శాతం పెంచడమే కాకుండా సకాలంలో చెల్లించని విద్యార్థులను క్లాసులకు అనుమతించకుండా వేధిస్తున్నారు. 
– ఇంటర్మీడియట్‌ బోర్డు నారాయణ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసుగా మారిపోయింది. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్‌ను ఇంటర్‌ బోర్డులో పెట్టే దోపిడీకి గేట్లు తెరిచారు. 
– విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న చైతన్య, నారాయణ యాజమాన్యాలు అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కూడా సరైన జీతాలు చెల్లించకుండా, మినిమం టైం స్కేల్‌ అమలు చేయకుండా వేధిస్తున్నాయి.  
– సంక్రాంతి సెలవుల నుంచి వచ్చిన విద్యార్థులను ఫీజులు కట్టలేదనే కారణంతో లోపలికి అనుమతించకుండా గేటు బయటే ఆపేసి అవమానిస్తున్నాయి. 

విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో దారుణం:
– విజయవాడలోని శ్రీచైతన్య గోశాల క్యాంపస్‌లో నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్న గౌతమ్‌ అనే విద్యార్థి రూ.20 వేల ఫీజు కట్టినా మరో రూ.50 వేలు కట్టేదాకా రావొద్దని గేటు బయటకు పంపేశారు. కొంచెం సమయం కావాలని ప్రాధేయపడినా వినిపించుకోలేదు.
– ఇది అమానుషమైన ఘటన. ఫీజులు చెల్లించాల్సిన తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి తప్ప, విద్యార్థులకు చదువులు నిరాకరించే హక్కు కాలేజీకి ఎవరిచ్చారు?.
– ఈ ఘటనపై ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు తక్షణమే స్పందించి కాలేజీ గుర్తింపును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్‌ చేస్తున్నాం. 
– సామాజిక సేవల పేరుతో సొసైటీల ముసుగులో ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు పొంది విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తున్న విద్యాసంస్థల ఆగడాలను తక్షణం అరికట్టాలి.
– ఒక పక్క చదువుల ఒత్తిడి, మరోపక్క ఫీజుల దోపిడీ కారణంగా మానసిక ఆందోళనకు గురై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ పాపం ఎవరిది..? 

ఫీజుల వసూళ్లపై నియంత్రణ ఏదీ?:
– ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ సక్రమంగా అమలు కావడం లేదు. 
– లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో భాగంగానే యథేచ్ఛగా ఈ ఫీజుల దోపిడీ జరుగుతోంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ దీనికి సమాధానం చెప్పాలి.  
– గత ఐదేళ్ల జగన్‌ పాలనలో విద్యా సంస్కరణలను అమలు చేయడం జరిగింది. విద్యార్థులను ఫీజుల కోసం వేధించిన దాఖలాలు లేవు. ఫీజుల నియంత్రణ కమిషన్‌ ద్వారా ఫీజుల దోపిడీని అరికట్టి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం జరిగింది. 
– అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసిన చైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపును  రద్దు చేసి బ్లాక్‌ లిస్టులో చేర్చిన ఘటనలు ఉంటే.., కూటమి ప్రభుత్వం వచ్చాక నీట్, ఐఐటీ, జేఈఈ పేరుతో, పుస్తకాల రూపంలో, యాప్‌ల కోసం  ఏకంగా 40 శాతం ఫీజులు పెంచేసి విద్యను పూర్తిగా వ్యాపారం చేశారు.
– వాటన్నింటినీ అరికట్టాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఒక్క కాలేజీ మీదనైనా చర్యలు తీసుకున్న దాఖలాలుంటే చూపించాలి. 

ఆపకపోతే ఆందోళన తప్పదు:
– ఇప్పటికైనా ఆయా విద్యా సంస్థలు ఫీజుల దోపిడి వెంటనే ఆపాలి. లేకపోతే విద్యార్థుల తరపున మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం.
– ఇంకా మా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక బాధిత విద్యార్థులతో మాట్లాడి వారి తరఫున ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటాం. 
– ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలి.
– మరో నెలరోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకెక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి కార్పొరేట్‌ కాలేజీల ఫీజుల దోపిడీకి కళ్లెం వేయాలని ఎ.రవిచంద్ర డిమాండ్‌ చేశారు.

Best Web Hosting Provider In India 2024