Saif Ali Khan : రిస్క్‌లో సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి చెందిన 15 వేల కోట్ల ఆస్తి.. ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ఛాన్స్!

Best Web Hosting Provider In India 2024


Saif Ali Khan : రిస్క్‌లో సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి చెందిన 15 వేల కోట్ల ఆస్తి.. ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ఛాన్స్!

Anand Sai HT Telugu
Jan 21, 2025 03:55 PM IST

Saif Ali Khan News : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగా, మధ్యప్రదేశ్ నుండి మరో వార్త వచ్చింది. సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను త్వరలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.

సైఫ్ అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్

సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి ఘటనపై విచారణ జరుగుతోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్‌తోపాటు వారి కుటుంబ ఆస్తులు భోపాల్‌లోని కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. పటౌడీ కుటుంబానికి చెందిన 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు.

yearly horoscope entry point

మధ్యప్రదేశ్ భోపాల్‌లోనే సైఫ్ కుటంబానికి వెయ్యి కోట్లకుపైగా ఆస్తి ఉంది. ఇక్కడ ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. అయితే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం.. భోపాల్‌లోని పటౌడీ కుటుంబానికి చెందిన 15వేల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి రావొచ్చు.

ఎనిమీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి

చారిత్రక భూమిపై ఎనిమీ ప్రాపర్టీ కేసులో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ గడువు ముగియడంతో ఆ ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన వ్యక్తులు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.

వారసులుగా కోర్టుకెక్కిన సైఫ్ ఫ్యామిలీ

ఈ ఆస్తికి సంబంధించి పటౌడీ(సైఫ్ ఫ్యామిలీ) కుటుంబం 2015లో పిటిషన్ దాఖలు చేసింది. శత్రు ఆస్తుల చట్టం, 1968 ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్థాన్ వెళ్లారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా ప్రకటించారు. నవాబ్ మరణం తరువాత అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్‌కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్‌వంటివారు సాజిదా వారసులు. ఈ నేపథ్యలో ఆస్తిపై తమకు హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందిన తర్వాత సైఫ్ అలీఖాన్‌కు భోపాల్ నవాబ్‌గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు.

సైఫ్ ముందు ఉన్న ఏకైక మార్గం ఇదే

2015 నుంచి భోపాల్‌లోని ఆస్తులపై స్టే ఉంది. ఇప్పుడు ఈ స్టేను కోర్టు ఎత్తివేసింది. దీంతో ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. 30 రోజుల్లో తమ వాదనను వినిపించాలని మధ్యప్రదేశ్ హై కోర్టు చెప్పినా.. సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్‌లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉంది. వారికి ఉన్న మార్గం ప్రస్తుతానికి ఇదే.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link