Best Web Hosting Provider In India 2024
Uggani: కర్నూల్ స్టైల్లో ఉగ్గాని చేసి చూడండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే టేస్టీ ఫుడ్ ఇది
Uggani: ఉగ్గాని పేరు చెబితేనే రాయలసీమ వారికి నోరూరిపోతుంది. మిగతావారు కూడా చాలా సులువుగా ఉగ్గాని వండేసుకోవచ్చు. రెసిపీ ఇదిగో.
ఉగ్గాని… రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో బాగా పాపులర్ అయిన వంటకం. రోడ్లమీద ఉగ్గాని అమ్మే బండ్లు అధికంగానే కనిపిస్తాయి. కానీ తెలంగాణలో, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్గాని పేరు కూడా తెలియదు. నిజానికి ఉగ్గాని ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయే ఫుడ్. మీరు స్నాక్ గా తిన్నా,బ్రేక్ ఫాస్ట్ గా తిన్నా కూడా ఇది టేస్టీగానే ఉంటుంది. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది. పిల్లలకు బాగా ఆకలేసినప్పుడు ఉగ్గాని చేసి పెట్టండి. ఇది ఆరోగ్యకరం కూడా.
కర్నూల్ స్టైల్లో ఉగ్గాని రెసిపీకి కావలసిన పదార్థాలు
మరమరాలు లేదా బొరుగులు – ఒక కప్పు
టమోటో – ఒకటి
ఎండు కొబ్బరి పొడి – ఒక స్పూను
శెనగపప్పు – మూడు స్పూన్లు
నూనె – ఒక స్పూను
జీలకర్ర – అర స్పూను
ఆవాలు – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
ఉల్లిపాయ – ఒకటి
ఎండుమిర్చి – అయిదు
పసుపు – పావు స్పూను
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కారం – అర స్పూను
ఉగ్గాని రెసిపీ
1. ఒక గిన్నెలో మరమరాలు లేదా బొరుగులను వేయండి.
2. ఒక కప్పు నీళ్లు కూడా వేసి నానబెట్టండి. అవి నానాక ఆ బొరుగులను చేత్తోనే పిండి ఒక గిన్నెలో వేసుకోండి.
3. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి, వేయించిన శెనగపప్పు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి.
4. పచ్చిమిర్చి, కరివేపాకులను కూడా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
6. ఆ నూనెలో జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి వేసి వేయించండి.
7. అలాగే ఉల్లిపాయ తరుగును, కరివేపాకుల తరుగును కూడా వేసి వేయించండి.
8. ఇప్పుడు టమోటా తరుగును కూడా వేసి వేయించండి.
9. ఆ మిశ్రమంలోనే పసుపు, ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి.
10. టమోటోలు మెత్తబడి ఇగురులాగా అయ్యి నూనె పైకి తేలుతుంది.
11. ఆ సమయంలోనే కారం, ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బొరుగులను వేసి బాగా కలపండి.
12. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్నా శెనగపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేయండి.
14. రుచికి సరిపడా ఉప్పును వేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు చివర్లో కొత్తిమీర తరుగును చల్లుకొని ఒకసారి కలిపేయండి.
15. అంతే కర్నూల్ స్టైల్లో ఉగ్గాని రెడీ అయిపోయింది. మీకు స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి, కారం వంటివి పెంచుకుంటే సరిపోతుంది.
16. కొంతమంది చాట్ మసాలాను కూడా దీనిపై చల్లకుంటారు. అది మీ ఇష్టమే.
ఉగ్గానిలో వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో కొబ్బరి పొడి వేయాలా వద్దా అన్నది మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. కొబ్బరిపొడి వేయకుండా కూడా ఉగ్గాని వండుకోవచ్చు. ఒక్కసారి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
సంబంధిత కథనం
టాపిక్