Best Web Hosting Provider In India 2024
TGRTC Income: ఆర్టీసీకి సం’క్రాంతి’.. కరీంనగర్ రీజియన్ కు రూ.24.71 కోట్ల ఆదాయం..
TGRTC Income: ఆర్టీసీ పండుగ చేసుకుంది. సంక్రాంతి పండగ ఆర్టీసీకి ఆర్ధిక క్రాంతిని తెచ్చింది. కరీంనగర్ రీజియన్ లో ఈనెల 7 నుంచి 19వ వరకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన 1795 ప్రత్యేక బస్సుల ద్వారా 48 లక్షల 99 వేల మంది ప్రయాణించడంతో ఆర్టీసీకి 24 కోట్ల 71 లక్షల ఆదాయం చేకూరింది.
TGRTC Income: సంక్రాంతి పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు రాకపోకలు సాగించడంతో సంస్థకు కాసుల వర్షం కురిసింది. మహిళలకు ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో ప్రయాణికులూ గణనీయంగా పెరిగారు.
రద్దీ ఉంటుందని ముందుగానే ఊహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కరీంనగర్ రీజియన్ లో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో ఈనెల 7 నుంచి 19వ వరకు ఆర్టీసీ 1795 ప్రత్యేక బస్సులు నడిపింది. తద్వారా 48 లక్షల 99 వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.
అందులో 34 లక్షల 5 వేల మంది మహిళలు(69,50 శాతం) ఉండటం విశేషం. ఓఆర్ సగటున 92 శాతంగా ఉంది. గతేడాది సంక్రాంతికి 44.63 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 27. 98 లక్షల మంది మహాలక్ష్ములు ఉన్నారు. జీరో టికెట్ కాకుండా రూ.13.95 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోల్చితే ఈసారి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.
ముందస్తు ప్రణాళితో…
సంక్రాంతి సందర్భంగా రద్దీ అధికంగా ఉంటుందని ముందే ఊహించిన అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్ బస్సులతో పాటు అదనపు సర్వీసులు నడిపారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ కు 855 సర్వీసులు, తిరుగు ప్రయాణంలో 940 అదనపు సర్వీసులు తిప్పారు. కొన్ని రోజులు సిటీ బస్సులను కూడా తెప్పించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కరీంనగర్ ఆర్ఎం బి. రాజు, డిప్యూటీ ఆర్ఎంలు, ఎస్. భూపతి రెడ్డి, సత్యనారాయణ, డీఎంలు ఈనెల 11 నుంచి జేబీఎస్ లో, 15 నుంచి కరీంనగర్ బస్టాండ్లో మకాం వేశారు. రద్దీకి అనుగుణంగా బస్సులు తిరిగేలా చూశారు.
మొదటి స్థానంలో గోదావరిఖని..
పండగ సందర్భంగా వచ్చిన ఆదాయపరంగా చూస్తే గోదావరిఖని, జగిత్యాల, కరీంనగర్-2 డిపోలు మొదటి మూడు స్థానాల్లో, హుస్నాబాద్ డిపో చివరి స్థానంలో నిలిచాయి. ప్రయాణికుల పరంగా గోదావరిఖని, జగిత్యాల, కరీంనగర్-1 డిపోలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో, మంథని డిపో చివరి స్థానంలో నిలిచాయి.
అందరి కృషి ఫలితమే..
సంక్రాంతి పండగ సందర్భంగా అధిక రద్దీ ఉన్నప్పటికీ అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, డ్రైవర్, కండక్టర్ల సహకారంతో ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడంలో సఫలమయ్యామని చెప్పారు.
48 లక్షల మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని గత ఏడాదితో పోల్చితే ఈసారి 4 లక్షల 39 వేల మంది ఎక్కువ గా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. హుజూరాబాద్, కోరుట్ల, మెట్ పల్లి, సిరిసిల్ల డిపోలు వందకు పైగా ఓఆర్ సాధించాయని ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్