Best Web Hosting Provider In India 2024
Coffee Scrub: అన్ని రకాల చర్మాలకు ఈ కాఫీ స్క్రబ్ అద్భుతంగా పనిచేస్తుంది, దీని తయారీ ఇదిగో
Coffee Scrub: కాఫీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. స్కిన్ టైప్ ను బట్టి కాఫీ స్క్రబ్స్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు, ఎలాగో తెలుసుకోండి.
కాఫీ సువాసన చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. అందుకే ఎంతో మంది కాఫీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. వెంటనే శరీరానికి చురుకుదనం వస్తుంది. ఇది ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాఫీ పొడిసహాయంతో చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు. ఇది బెస్ట్ ఎక్స్ఫోలియేటర్లా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో, వివిధ చర్మ రకాల కోసం కాఫీ స్క్రబ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఇంట్లో ఉండే కాఫీపొడిని ఉపయోగించి పొడి చర్మం, ఆయిలీ స్కిన్, సాధారణ స్కిన్ వంటి చర్మరకాలకు ఫేస్ స్క్రబ్ తయారు చేసే పద్ధతి ఇదిగో.
పొడి చర్మానికి కాఫీ స్క్రబ్ తయారీ
కాఫీ పొడి – అర స్పూను
పెరుగు – ఒక స్పూను
పొడి చర్మం కలవారికి కాఫీతో స్క్రబ్ తయారుచేయడం చాలా సులభం. డ్రై స్కిన్ కోసం కాఫీ స్క్రబ్ తయారు చేసుకోవాలంటే ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. సుమారు పది నిమిషాల పాటు స్క్రబ్ తో వృత్తాకార కదలికలో సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ స్క్రబ్ ను వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. మీకు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం మెరిసిపోతుంది.
జిడ్డు చర్మానికి కాఫీ స్క్రబ్ తయారీ
కాఫీ పొడి – ఒక స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
కొబ్బరి నూనె – అర స్పూను
జిడ్డు చర్మం లేదా ఆయిలీ స్కిన్ కలవారు ఒకటిన్నర టీస్పూన్ల కాఫీ పొడిలో, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. అందులో అర టేబుల్ స్పూన్ కరిగించిన కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. తర్వాత నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత టోనర్, మాయిశ్చరైజర్ వాడాలి.
మొటిమలు వచ్చే చర్మానికి
కాఫీ పొడి – ఒక స్పూను
బియ్యప్పిండి – ఒక స్పూను
గోరువెచ్చని నీరు – రెండు టీస్పూన్లు
మొటిమలు అధికంగా వచ్చే సమస్య కొంతమందికి ఉంది. దీన్ని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ కాఫీలో ఒక టీస్పూన్ బియ్యం పిండిని మిక్స్ చేసి, తరువాత రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి తేలికపాటి చేతులతో స్క్రబ్ చేయాలి. పేస్ట్ ఆరిపోయే వరకు కొన్ని నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)