Best Web Hosting Provider In India 2024
Grama Sabhalu : మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు
Grama Sabhalu : తెలంగాణలో నిర్వహిస్తోన్న గ్రామ సభలు నిరసనలకు వేదికగా మారాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తుల సంగతేంటని ప్రశ్నిస్తూ స్థానిక సమస్యలపై మండిపడుతున్నాయి. మంత్రులకు సైతం నిరసన సెగ తగిలింది.
Grama Sabhalu : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు నిరసన ఆందోళనలకు వేదికలుగా మారుతున్నాయి. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పిస్తూనే ఇదివరకు ఇచ్చిన దరఖాస్తుల సంగతేంటని ప్రశ్నిస్తూ స్థానిక సమస్యలపై ఏకరువు పెడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లకు నిరసన సెగ తగిలింది.
నిరుపేదల నిరసన ఆందోళన మధ్య ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు జరుగుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక జాబితా ఆమోదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సభలు దరఖాస్తుల స్వీకరణ, నిరసన ఆందోళనకు వేదికలుగా మారాయి. ఏళ్ళ తరబడి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ప్రాథమికంగా తయారు చేసిన జాబితాలో పేర్లు లేకపోయేసరికి అర్హులైన నిరుపేదలు ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తూ అధికారులను పాలకులను నిలదీస్తున్నారు. ఇది వరకు ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి… సమగ్ర కులగణన సర్వే ద్వారా తేల్చింది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ఎందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన ఆందోళనలతో చాలా గ్రామాల్లో ప్రభుత్వం ప్రాథమికంగా తయారు చేసిన జాబితాను ప్రకటించకుండా అర్హులైన నిరుపేదలందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని అధికారులు పాలకులు ప్రకటించి తప్పించుకుంటున్నారు.
మంత్రులకు తప్పని నిరసన సెగ
ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ తగిలింది. ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటనతో నాలుగు గ్రామ సభలో పాల్గొన్నారు. మానకొండూర్ నియోజకవర్గం రేణికుంట, చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్, వేములవాడ నియోజకవర్గం రుద్రంగి, ధర్మపురి నియోజకవర్గం జైన గ్రామసభలో పాల్గొన్న మంత్రులకు నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు నిరసన సెగ తగిలించారు. రిజర్వాయర్ తో తమ కొంపలు ముంచొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రిజర్వాయర్ నుంచి ఇళ్లలోకి నీళ్లు చేరి నిద్రలేని రాత్రి గడపవలసి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని నిలదీశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా ఆందోళనతో అడ్డుతగిలారు. దీంతో మాజీ సర్పంచ్ నజీర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారిని సముదాయించి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ అని నిరుపేదలందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.
గత పాలకులు చేయలేని పని చేస్తున్నాం…
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిరుపేదలకు పదేళ్లుగా రేషన్ కార్డులు అందలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికీ 40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు అర్హులైన పేదలను అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం త్వరలో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని అవి యధావిధిగా పని చేస్తాయని, పాత కార్డులను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు నిరంతర ప్రక్రియని తెలిపారు. ఇదివరకు దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గతంలో ప్రజావాణి, ప్రజాపాలన, మీసేవ లో దరఖాస్తు చేసుకున్న వారికి కుల గణనలో రేషన్ కార్డు లేదని తెలిపిన వారిలో అర్హులను గుర్తించి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
ఆందోళన వద్దు… మంత్రి పొన్నం…
నాలుగు పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో కొందరు ఓర్వలేక ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పదేళ్ళు ఏ పని చేయలేని వారు, ఇప్పుడు జాబితాలో పేర్లు లేవని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి…ఎవ్వరు ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం కోరారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్నారు.
ప్రాజెక్టులను సందర్శించిన మంత్రులు
ప్రజాపాలన గ్రామసభల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టుల బాటపట్టారు. నిర్మాణంలో ఉన్న నారాయణపూర్, కలికోట సూరమ్మ రిజర్వాయర్లను సందర్శించారు. స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం భూ సేకరణ పని పూర్తి కావాల్సి ఉందని అందుకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరారు. కలికోట సూరమ్మ రిజర్వాయర్ లో వచ్చే వర్షాకాలంలో నీటిని నిలువ చేసేలా కృషి చేస్తామని మంత్రులు తెలిపారు. అదేవిధంగా ఏడాదిలోగా నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నామమాత్రం ప్రయోజనం చేకూర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం జరిగేలా చూస్తుందన్నారు. నారాయణపూర్, కలికోట సూరమ్మ రిజర్వాయర్ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఏడాదిలో పూర్తి చేయిస్తామన్నారు. ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్