Best Web Hosting Provider In India 2024
Karivepaku Pulihora: కరివేపాకు పులిహోర ఇలా చేసేయండి నోటికి కమ్మగా అనిపిస్తుంది రెసిపీ ఇదిగో
Karivepaku Pulihora: కరివేపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పులిహోర చేసి చూడండి. రుచి అదిరిపోతుంది/ కరివేపాకు పులిహోర రెసిపీ ఇదిగో.
పులిహోరలో కరివేపాకులు వేస్తారు, కానీ కరివేపాకులతోనే పులిహోర చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటుందో. పైగా కరివేపాకుల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కరివేపాకు పులిహోరను చేయడానికి చాలా తక్కువ సమయం సరిపోతుంది. ఇది చూడటానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి తినడానికి కూడా రుచిగా అనిపిస్తుంది. నోటికి కమ్మగా కరివేపాకు పులిహోర ఎలా చేయాలో తెలుసుకోండి.
కరివేపాకు పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం – రెండు కప్పులు
నూనె – మూడు స్పూన్లు
కరివేపాకులు – ఒక కప్పు
ఆవాలు – మూడు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
పచ్చిశనగపప్పు – ఒక స్పూను
వేరుశెనగ పలుకులు – పావు కప్పు
ఎండుమిర్చి – ఐదు
పచ్చిమిర్చి – ఐదు
చింతపండు – నిమ్మకాయ సైజులో
ఉప్పు – రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు – రెండు
పసుపు – అర స్పూను
ఇంగువ – చిటికెడు
కరివేపాకు పులిహోర రెసిపీ
1. అన్నాన్ని ముందుగానే వండుకుని పొడిపొడిగా వచ్చేలా ఒక బేసిన్లో ఆరబెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి.
3. అందులో ఒక కప్పు కరివేపాకులను వేసి వేయించాలి.
4. వాటిని తీసి ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ మిక్సీ జార్ లోనే రెండు స్పూన్ల ఆవాలు, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు కళాయిలో మిగిలిన నూనెలో ఒక స్పూను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.
6. అలాగే గుప్పెడు కరివేపాకులు కూడా వేయాలి.
7. అందులోనే పసుపు ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇప్పుడు ముందుగానే చింతపండును నానబెట్టి గుజ్జులా చేసుకుని ఆ గుజ్జును కూడా కళాయిలోని మిశ్రమంలో వేసుకోవాలి.
9. అలాగే చిటికెడు ఇంగువను కూడా వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని నూనె తేలే వరకు వేయించుకోవాలి.
10. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
11. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని అన్నం పైన వేసి పులిహోరలాగా కలుపుకోవాలి.
12. అలాగే మిక్సీలో పొడి చేసుకున్నా కరివేపాకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. అంతే టేస్టీ కరివేపాకుల పులిహోర రెడీ అయినట్టే. ఒక్కసారి దీన్ని మీరు వండి చూడండి. ఎంత సులువుగా అయిపోతుందో. పైగా దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
కరివేపాకు పులిహోర లంచ్ బాక్స్ గా, డిన్నర్ రెసిపీగా కూడా బాగుంటుంది. వీలైతే బ్రేక్ ఫాస్ట్ లో కూడా తినవచ్చు. ఎలా తిన్న కరివేపాకు పులిహోర కమ్మగా ఉండడం ఖాయం. సాధారణ పులిహోరతో పోలిస్తే ఈ కరివేపాకు పులిహారలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కరివేపాకులు ఇందులో అధికంగా వేసాము. కరివేపాకుల తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. అలాగే జుట్టు, చర్మం కూడా మృదువుగా మారుతుంది. జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. సాధారణ పులిహోర కన్నా ఇలా కరివేపాకు పులిహోర చేసుకొని చూడండి. మీకు ఇది నచ్చడం ఖాయం.
సంబంధిత కథనం