Best Web Hosting Provider In India 2024
ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్
మేనిఫెస్టోలో ఇచ్చిన 9 హామీలను గాలికొదిలేశారు
తక్షణం అమలు చేస్తామన్నవీ అస్సలు పట్టించుకోలేదు
గుర్తు చేసిన ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి
కనీసం 12వ పీఆర్సీ వేయకపోవడం న్యాయమా?
ఏ పెన్షన్ స్కీమ్ ఉందో ఉద్యోగులకు అర్థంకాని పరిస్థితి
పెన్షన్ స్కీం విషయంలో అసలు ప్రభుత్వ నిర్ణయం ఏంటి?
సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్..లపై స్పష్టత ఎప్పుడిస్తారు?
సూటిగా ప్రశ్నించిన నలమారు చంద్రశేఖర్‌రెడ్డి
ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిలే రూ.26 వేల కోట్లు
రూ.1300 కోట్లిస్తున్నాం.. పండగ చేసుకోమంటారా?
సంక్రాంతి ముగిసి వారమైనా నిధులు విడుదల చేశారా?
అసలు ఉద్యోగుల సొమ్ముపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు?
ప్రెస్‌మీట్‌లో ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపణ
తాడేపల్లి: ఎన్నికలకు ముందు రకరకాల హామీలతో ఉద్యోగులకు మాయ మాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవడం మానేశారని, ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మేనిఫెస్టోలో ప్రకటించిన 9 హామీల్లో కనీసం ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వమే రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న రూ.1300 కోట్లు, పండగ ముగిసి వారమైనా విడుదల చేయలేదని ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగుల బకాయిలు రూ.26 వేల కోట్లు:
– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటిని అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు. కానీ, మాట నిలబెట్టుకోలేదు.
– పాత పీఆర్సీ బకాయిలు, ఇతర బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఈఎల్స్ ఎన్‌క్యాష్‌మెంటు, జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ (ప్రభుత్వ బీమా), మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. వంటివి దాదాపు రూ.26 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వెంటనే అవన్నీ చెల్లించాలి.
– సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు రూ. 1300 కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు మా డబ్బులు మాకివ్వడం కూడా గొప్పేనా అని ఆశ్చర్యపోయాం. సంక్రాంతి ముగిసి వారం దాటినా ఉద్యోగులకు చెల్లించిన పాపాన పోలేదు.
– సంక్రాంతి కానుక కింద రూ.250 కోట్లు టీడీఎస్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఉద్యోగులది. ఎందుకంటే ఆదాయపు పన్ను కట్టే ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ కట్ కాదు. మరి ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నారో ఎందుకు చెల్లిస్తున్నారో అయోమయం నెలకొంది.
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో..:
– గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఏదైనా బెనిఫిట్స్ అమలు చేయాలంటే సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి మంత్రులను పిలిచి వారి సమక్షంలోనే ఫలానా బెనిఫిట్స్ కింద ఇంత అమౌంట్ ఇస్తామని తేదీలు ప్రకటించి విడుదల చేసేవారు.
– కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పారదర్శకత కొరవడింది. పత్రికల్లో ప్రకటనలే తప్ప ఉద్యోగులకు జరుగుతున్నది మాత్రం శూన్యం.
మాట తప్పిన కూటమి ప్రభుత్వం:
– సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అడుగులు పడినట్టు కనిపించడం లేదు.
– సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్‌లో.. ఏ విధానంలో కొనసాగుతున్నామో ఉద్యోగులకు అర్థంకాని పరిస్థితి నెలకొంది.
– మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 1.07.2023 నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నా అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో కనీసం పే రివిజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు.
– ఉద్యోగులకు వచ్చే అలవెన్సులు చాలా తక్కువగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చాక పునఃపరిశీలన చేసి అలవెన్సులు పెంచుతామని హామీ ఇస్తే.. హెచ్‌ఆర్‌ఏ పెంచుతారని ఆశించిన ఉద్యోగులకు భంగపాటు తప్పలేదు.
ఉద్యోగుల డిమాండ్లు:
– కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని హామీ ఇచ్చారు. నెరవేర్చలేదు. 30 శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలి.
– ప్రతినెలా ఒకటో తారీఖున పెన్షన్లు, జీతాలు ఇస్తామని చెప్పిన హామీ మొదటి రెండు నెలలకే పరిమితమైంది. గడిచిన నాలుగులు నెలలుగా 5, 6 తేదీల తర్వాతనే జీతాలు చెల్లిస్తున్నారు.
– పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఓటేయించుకున్నారు కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు.
– తక్కువ జీతాలు పొందే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు అలాంటి పథకాలేవీ వర్తింప జేయలేదు.
– అధికారంలో ఉన్నప్పుడు వేతనాలు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని వలంటీర్లకు లేనిపోని ఆశలు కల్పించారు. ఎన్నికల్లో ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా కనీసం వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారు.
– ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలు తక్షణం అమలు చేయాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ పెండింగ్ పెట్టిన రెండు డీఏ బకాయిలు చెల్లించాలి.
– ప్రతి ఏడాది జనవరిలో విధిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. మొదటి సంతకం చేసి మెగా డీఎస్సీని అటకెక్కించారు.
– యువతకు ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి చెల్లిస్తామని చెప్పి మాట తప్పారు. తక్షణం అమలు చేయాలి. విదేశీ విద్య పథకాన్ని అమలు చేయాలి.
– రాష్ట్రంలో 3.80 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మంజూరు చేయాలి.
– ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రులు ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డులకు ఉచిత వైద్యం నిరాకరిస్తున్నాయి.
– అందుకే ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు విధిగా చెల్లించి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అమలు జరిగేలా చూడాలి.
– అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించడంతోపాటు ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలి.
– ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయ్యేలోపు ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలి.