Best Web Hosting Provider In India 2024
Vizag Steel Plant : ఒకవైపు ప్యాకేజీ ప్రకటన.. మరోపక్క భద్రతా సిబ్బంది కుదింపు.. స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.11,444 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నేతలు, మేథావులు స్టీల్‌ప్లాంట్ గురించి చర్చిస్తున్నారు.
ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అంటున్నారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. భద్రతా సిబ్బందిని తొలగిస్తున్నారు. ఇది ప్రైవేటీకరణలో భాగమేనని కార్మిక సంఘాల నేతలు చెబుతోన్నారు. ఏళ్ల తరబడి స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో నడిచే ఫైర్ స్టేషన్‌ను ప్రైవేట్‌కు వ్యక్తులకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఇప్పుడు భద్రతా సిబ్భందిని కుదిస్తోన్నారు.
ప్యాకేజీతో హడావుడి..
దీనిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకపక్క ప్యాకేజీతో హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలు ఆపటం లేదని కార్మిక సంఘం నేత సీహెచ్ నర్సింగ్‌రావు విమర్శించారు. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో దాదాపు 800 మందిని రెన్యువల్ చేయలేదు. ఉద్యోగులు, అధికారులను వీఆర్ఎస్ పేరుతో పంపించే ప్రక్రియ సాగుతోంది. ఇంకోవైపు ఉద్యోగులకు ఇవ్వాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఎల్‌టీఏ, హెఆర్ఏలు నిలిపివేశారు. దసరా, దీపావళి బోనస్ పూర్తిగా ఆపేశారు.
సిబ్బంది కుదింపు..
ప్రధాన గేటు వద్ద ఉండే సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందిని తగ్గిస్తున్నట్లు.. సీజీఎం (వర్క్స్)కు సీనియర్ కమాండెంట్ లేఖ రాశారు. సాధారణ షిప్టుల్లో లోపలికి, బయటకు వచ్చే సమయంలో వాహనాల తనిఖీలు చేసే సిబ్బందిని కుదించారు. బుధవారం (జనవరి 22) నుంచే తగ్గింపు వర్తించేలా లేఖలో పేర్కొన్నారు. దీంతో 10 నుంచి 12 మంది ఉండే సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్థానంలో.. కేవలం నలుగురిని మాత్రమే ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.
మెడికల్ స్కీమ్‌లో..
ఇప్పుడు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే మెడికల్ స్కీంలో.. భారీ కోతలకు యాజమాన్యం ప్రతిపాదన చేసింది. ఆమోదం తరువాత త్వరలోనే ఇది అమలులోకి రానుంది. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీం (జీఎంఎస్) అందిస్తున్నారు. ఈ పథకంలో దంపతులకు రూ.6 లక్షల వరకూ మెడికల్ ఇన్సురెన్స్ వర్తిస్తుంది. దంపతులిద్దరూ ఇన్సురెన్సు వాటా కింద రూ.2,600 ఏటా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన నగదును స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం భరిస్తోంది.
కార్మిక సంఘాల ఆగ్రహం..
ఓపీడీ ఇద్దరికి రూ.16 వేలు ఇస్తారు. స్టీల్‌ప్లాంట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే ఉచితం. బయట ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, మందులు కొనుగోలు చేసిన ఓపీడీ నగదు రీయింబర్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చారు. ఉద్యోగులు 30 శాతం కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలన్నింటిపై రూ.9 కోట్ల భారం పడుతోంది. ఓపీడీలో రూ.16 వేలులో సగానికి కోత విధించారు. దీనిపై కార్మిక, ఉద్యోగ సంఘాలు మండిపడుతోన్నాయి.
విధివిధానాలేంటి..
మరోవైపు గొప్పగా చెప్పుకున్న పునరుద్ధరణ ప్యాకేజీకి సంబంధించిన విధివిధానాలు ఇప్పటికీ విడుదల కాలేదు. మొత్తం ప్యాకేజీ రూ.11,444 కోట్లు కాగా, మొదటి విడుతగా విడుదల చేసే రూ.10,300 కోట్ల విలువైన బాండ్లును ఏయే ఖర్చులకు ఉపయోగించాలో ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై అయోమయం నెలకొంది. ప్యాకేజీ పట్ల అనుమానులు వ్యక్తం అవుతోన్నాయి. ప్యాకేజీ కేవలం ప్రకటన మాత్రమేనా లేక కార్యరూపం దాల్చుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వీరిఆర్ఎస్కు దరఖాస్తులు..
ఇప్పటి వరకు 700 మంది ఉద్యోగులు, అధికారులు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఈనెల 31 వరకు వరకు వీఆర్ఎస్కు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. వీఆర్ఎస్ తీసుకునే వారి సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 12,300 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా.. వారిలో ఈ ఏడాది ఆగస్టులో 800 మంది రిటైర్డ్ కాబోతున్నారు. ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గనుంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్