Best Web Hosting Provider In India 2024
ప్రభుత్వం స్పందించకుంటే ఫీజు పోరు తప్పదు
విద్యార్థుల పక్షాన వైయస్ఆర్‌సీపీ నిలబడి పోరాడుతుంది
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం
ఫిబ్రవరి 5న జిల్లా కలెక్టర్లను కలిసి విజ్ఙప్తి చేస్తాం
హెచ్చరించిన వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం ఆపండి
విద్యారంగాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం తప్పు
చంద్రబాబు నియంత పోకడలను వదిలిపెట్టాలి
ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హితవు
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు అర్థంతరంగా చదువులకు దూరమవుతున్నారని, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని.. తక్షణమే రూ. 4 వేల కోట్ల బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన నిలబడి వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి విజ్ఞాపనపత్రాలు సమర్పిస్తామని అప్పిరెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఏమన్నారంటే..
– పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే మంచి ఆలోచనతో ఆనాడు దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తీసుకొస్తే.. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో ఆ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో మరింత ముందుకు తీసుకెళ్లారు.
– విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యావిప్లవం తీసుకొచ్చి దేశంలోనే ఏపీని ముందు వరుసలో నిలబెట్టారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారు.
– విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చును పిల్లల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడిగానే వైఎస్ జగన్ భావించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్లోబల్ స్టార్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యా పథకాలకు సంబంధించిన నిధులను త్రైమాసికాల ప్రకారం ఎప్పటికప్పుడు విడుదల చేశారు.
విద్యార్థులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజురీయింబర్స్‌మెంట్ బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు అర్థంతరంగా చదువులు మానేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది.
– ఫీజులు కట్టని విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు గేటు కూడా తాయనియ్యడం లేదు. పెండింగ్ ఫీజులు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు వేధిస్తున్న ఘటనలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– పేరుకేమో చంద్రబాబు గ్లోబల్ లీడర్‌నని చెప్పుకుంటూ థింక్ గ్లోబల్ యాక్ట్ గ్లోబల్ అని స్లోగన్స్ ఇస్తాడు. కానీ పేద విద్యార్థులు చదువులకు దూరమై లోకల్ స్థాయిలోనే ఆగిపోతుంటే వారివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
– ఇప్పటివరకు మూడు పర్యాయాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏనాడూ విద్యకు, విద్యార్థుల చదువులపై శ్రద్ధ చూపలేదు. ఆఖరుకి విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పిన పెద్దమనిషి చంద్రబాబు.
రూ. 3,900 కోట్ల బకాయిలు
– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. విద్యాదీవెనకు సంబంధించి రూ. 2,800 కోట్లు, వసతి దీవెన కింద రూ. 1,100 కోట్లు.. మొత్తంగా రూ. 3,900 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది.
ఫిబ్రవరి 5న పోరాటం
– ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సుమారు రూ. 4 వేల కోట్ల పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలి. రాజకీయ కోణంలో ఆలోచించకుండా విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేయాలి.
– లేనిపక్షంలో ఫిబ్రవరి 5న వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తాం.
– మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మద్దతు ధర కల్పించాలని రైతుల పక్షాన, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ వినియోగదారుల పక్షాన నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.
– విద్యార్థిలోకంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తే దానికి మూల్యం చెల్లించుకోకతప్పదు.