Best Web Hosting Provider In India 2024
TG Grama Sabhalu : గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు – ఫైనల్ లిస్ట్ పై కీలక ప్రకటన
ప్రభుత్వం అమలు చేసే స్కీమ్ ల అర్హుల జాబితాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని స్పష్టం చేశారు. జాబితాలో ఉంటే ఉన్నట్లు…. లేకపోతే రానట్లు కాదని చెప్పుకొచ్చారు. అసలైన అర్హులనే గుర్తించి ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. జనవరి 24వ తేదీతో పూర్తి అవుతాయి. ప్రధానంగా నాలుగు స్కీమ్ ల కోసం అర్హులను గుర్తించే పనిలో సర్కార్ ఉంది. ఇందుకోసం ప్రాథమికంగా కొన్ని జాబితాలను సిద్ధం చేసింది. అర్హుల గుర్తింపు ప్రక్రియ గ్రామసభలు కీలకంగా ఉంటాయని కూడా స్పష్టం చేసింది.
అయితే చాలా గ్రామాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. జాబితాలో తమ పేర్లు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమకు రేషన్ కార్డు రాలేదని చెబుతున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్ కు లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటంతో… వడపోతతో పాటు అసలైన వారిని గుర్తించటం ప్రభుత్వానికి సవాల్ గా మారిందనే చెప్పొచ్చు.
ఆ తర్వాతే ఫైనల్ జాబితా – మంత్రి పొంగులేటి
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని స్పష్టం చేశారు. జాబితాలో ఉంటే ఉన్నట్లు…. లేకపోతే రానట్లు కాదని చెప్పుకొచ్చారు.
అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. వాటి ఆధారంగానే ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పేదవాళ్లలో బహు పేద వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుందని విమర్శించారు. ఇలాగే చేస్తే బీఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు.
కొనసాగుతున్న గ్రామసభలు:
కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక జాబితా ఆమోదానికి ప్రభుత్వం గ్రామసభలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రామ, వార్డు సభలు దరఖాస్తుల స్వీకరణ, నిరసన ఆందోళనకు వేదికలుగా మారాయి.
ఏళ్ళ తరబడి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ప్రాథమికంగా తయారు చేసిన జాబితాలో పేర్లు లేకపోయేసరికి అర్హులైన నిరుపేదలు ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తూ అధికారులను పాలకులను నిలదీస్తున్నారు. ఇది వరకు ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి… సమగ్ర కులగణన సర్వే ద్వారా తేల్చింది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
మళ్ళీ ఎందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన ఆందోళనలతో చాలా గ్రామాల్లో ప్రభుత్వం ప్రాథమికంగా తయారు చేసిన జాబితాను ప్రకటించకుండా అర్హులైన నిరుపేదలందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామసభలు రేపటితో పూర్తి కానున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్