Best Web Hosting Provider In India 2024
Kichcha Sudeep: బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తానన్నా వద్దంటున్న ఈగ విలన్.. ఇదీ కారణం
Kichcha Sudeep: బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎంతో మంది కలలు కంటారు. కానీ ఈగ మూవీలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ హీరో మాత్రం అక్కడి ప్రభుత్వం తనకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తానన్నా వద్దంటున్నాడు. దీనికి కారణమేంటో కూడా అతడే చెప్పుకొచ్చాడు.
Kichcha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుసు కదా. ఈగ, బాహుబలిలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు అతడు. కర్ణాటక ప్రభుత్వం తనకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తానన్నా కూడా వద్దంటూ ఇప్పుడతడు వార్తల్లో నిలిచాడు. 2019లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా పైల్వాన్ మూవీ కోసం కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీ కోసం సుదీప్ ను ఎంపిక చేశారు.
కిచ్చా సుదీప్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు
కర్ణాటక ప్రభుత్వం బుధవారం (జనవరి 22) 2019 ఏడాది కోసం స్టేట్ యానువల్ ఫిల్మ్ అవార్డులను అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుల కోసం కిచ్చా సుదీప్, అనుపమ గౌడలను ఎంపిక చేసింది.
పైల్వాన్ మూవీలో తాను పోషించిన పాత్ర కోసం సుదీప్ ను, త్రయంబకం మూవీలో పాత్ర కోసం అనుపమను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు. కొవిడ్ కారణంగా 2019 తర్వాత అవార్డులను ఇవ్వలేదు. ఇప్పుడు 2019 ఏడాదికి అనౌన్స్ చేయగా.. 2020 నుంచి 2024 వరకు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
అవార్డు వద్దన్న సుదీప్
అయితే కర్ణాటక ప్రభుత్వం తనకు ఇస్తానన్న బెస్ట్ యాక్టర్ అవార్డును కిచ్చా సుదీప్ తిరస్కరించాడు. తాను చాలా రోజులుగా ఎలాంటి అవార్డులను స్వీకరించడం లేదని, దానినే కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
“గౌరవనీయులైన కర్ణాటక ప్రభుత్వం, జ్యూరీ సభ్యులకు.. బెస్ట్ యాక్టర్ కేటగిరీ కింద అవార్డు రావడం గొప్ప గౌరవం. ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే కొన్నేళ్లుగా పలు వ్యక్తిగత కారణాల వల్ల నేను ఎలాంటి అవార్డులు స్వీకరించడం లేదు. దానినే కొనసాగించాలని భావిస్తున్నాను” అని సుదీప్ అన్నాడు.
“ఈ కళకు ప్రాణం పోసిన ఎంతో మంది అర్హులైన నటులు ఉన్నారు. నాకంటే కూడా వాళ్లు ఈ అవార్డుకు మరింత అర్హులు. వాళ్లలో ఒకరు ఈ అవార్డు అందుకుంటే నాకు చాలా సంతోషం. అవార్డులతో సంబంధం లేకుండా నేను పూర్తి చిత్తశుద్ధితో అందరినీ ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాడు.
జ్యూరీ నుంచి వచ్చిన ఈ గుర్తింపు నాలో మరింత ఉత్సాహం నింపింది” అని సుదీప్ అన్నాడు. ఈ గుర్తింపే తనకు రివార్డు అని స్పష్టం చేశాడు. తన నిర్ణయం వల్ల కలిగిన అసంతృప్తికి క్షమాపణ చెబుతున్నట్లు కూడా తన ట్వీట్ లో సుదీప్ పేర్కొన్నాడు.
సంబంధిత కథనం