Best Web Hosting Provider In India 2024
Parenting Tips: మీ పిల్లలు ఆల్ రౌండర్లుగా ఉండాలంటే మీరు చేయాల్సిన పనులు కొన్ని పనులు ఉన్నాయి! అవేంటో చూడండి
Parenting Tips: తల్లిదండ్రులంతా తమ పిల్లుల భవిష్యత్తు బాగుండాలనీ, వారు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకుంటారు. అయితే ఇందుకోసం కేవలం వారు మాత్రమే కష్టపడితే సరిపోదు, మీరు కూడా చిన్నతనం నుంచి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.
ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. ఎదగడం అంటే కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే రోజులు పోయాయి. ఈ రోజుల్లో చదువుతో పాటు, క్రీడలు, ఇతర సామాజిక నైపుణ్యాలలో మెరుగుపడటం కూడా అంతే ముఖ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు ఏదైనా ఒక విషయంలో మాత్రమే ప్రావీణ్యులుగా ఉండే కన్నా ఎక్కువ విషయాల గురించి నైపుణ్యం కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలను ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దాల్సిన సమయం ఇది. అయితే ఇందుకోసం కేవలం పిల్లలు మాత్రమే కష్టపడితే సరిపోతుందా? అంటే కచ్చితంగా కాదనే చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. పిల్లల విజయంలో, ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఇది చిన్నప్పటి నుంచే మొదలవాలని కూడా సూచిస్తున్నారు. పిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుండాలంటే పేరెంట్స్ గా మీరు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.
నైపుణ్యాలను పరిశీలించాలి:
ప్రతి పిల్లవాడు భిన్నంగా ఉంటాడు, వారి వ్యక్తిత్వం, ఆసక్తులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్నట్టుగానో, సమాజం కోరుకున్నట్టుగానో ఉండాలని కాకుండా పిల్లల ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం అవుతుంది. వారికి నచ్చిన పని చేస్తున్నప్పడే వారు సంతోషంగా ఉంటారు. విజయానికి ఎప్పుడూ చేరువలోనే ఉంటారు. కనుక మీరు పిల్లలతో కూర్చుని మాట్లాడండి, వారితో సమయాన్ని గడిపి వారి ఆసక్తిని, నైపుణ్యాలను గుర్తించండి. ఆ దిశగా వారిని ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల బిడ్డ సంతోషంగా తన పనులన్నీ చక్కబెట్టుకుంటాడు.
జీవనశైలిలో మార్పులు చేయాలి:
మీరు జీవితంలో ఏ రంగంలోనైనా మెరుగ్గా రాణించాలనుకుంటే, మొదట మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. ఇందులో పిల్లల ఆహారం, అతని అలవాట్లు వంటి అన్ని విషయాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఆహారం గురించి శ్రద్ధ వహించడం తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఇంట్లోనే వండిన పౌష్టికాహారం వారికి అందించాలి. పిల్లలు నిద్రలేచే సమయాన్ని కూడా నిర్ణయించాలి. సరైన నిద్ర, సరైన ఆహారం పిల్లల మేధో శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లు వారిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవే విజయానికి దగ్గర చేస్తాయి.
ఒకే విషయానికి అంకితం చేయకండి:
పిల్లవాడిని ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దాలనుకుంటే రోజంతా ఏదో ఒక విషయానికే అంకితం చేయడం మంచిది కాదు. రోజంగా చదువుకే సమయం కేటాయించకుండా,వారి ఆసక్తికి తగినట్లుగా ఇతర కార్యకలాపాలకు కూడా సమయం కేటాయించేలా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లలు నృత్యం, సంగీతం, కళ లేదా ఏదైనా క్రీడను ఇష్టపడితే ఆ క్లాసులు ఇప్పించండి. కొత్త కొత్త విషయాలను నేర్చుకునేలా, కొత్త అభిరుచులను ప్రయత్నించేలా వారిని ప్రేరేపించండి. పిల్లవాడు ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ అయితే అంత ఎక్కువ నేర్చుకోగలుగుతారని గుర్తుంచుకోండి.
సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్పించండి:
సమయ నిర్వహణ అంటే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, ఇది జీవితమంతా చాలా అరుదుగా వచ్చే జీవన నైపుణ్యం. దీన్ని ఒకసారి నేర్చుకున్నవాడు జీవితంలో చాలా దూరం వెళ్తాడు. కనుక పిల్లలకు చిన్నప్పటి నుండి సమయం ప్రాముఖ్యతను చెప్పండి. ప్రతి పనిని సమయానికి చేయడం అలవాటు చేయండి. ఇందుకోసం మీరు ఒక టైమ్ టేబుల్ సెట్ చేయండి. వారి కార్యకలాపాలు, ఖాళీ సమయం, ఆహరం, నిద్ర వంటి ప్రతి విషయాన్ని ఈ సమయ పట్టికలో చేర్చండి. ఇది అనుసరిచండం పిల్లలకు ఇబ్బందికరంగా ఉండకుండా చూసుకోండి. బలవంతపెడితే వారి ఆసక్తి దెబ్బతినే ప్రమాదముంది. వారు దాన్ని అనుసరించడం మానేస్తారు.
పాజిటివ్ మైండ్‌సెట్ పెంపొందించండి:
మనిషి ఆలోచన అతడిని పైకి, కిందకు తీసుకెళ్లడానికి పనిచేస్తుంది. కాబట్టి పాజిటివ్ మైండ్‌సెట్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. చిన్నతనం నుండే దీనికి మీరు గట్టి పునాది వేయడం మంచిది. క్లిష్ట పరిస్థితుల్లో తమను తాము హ్యాండిల్ చేసుకోవడం పిల్లలకు నేర్పించండి. విజయం గురించి మాత్రమే కాకుండా, ఓటమిని సానుకూలంగా ఎలా తీసుకోవాలో, దాని నుండి ఏమి నేర్చుకోవాలో కూడా పిల్లలతో మాట్లాడండి. అప్పుడప్పుడూ ఇలాంటి పుస్తకాలు, సినిమాలు, ఇంటర్వ్యూలు, కథలు చెప్పి పిల్లలను ఉత్తేజపరుస్తూ ఉండండి.