Best Web Hosting Provider In India 2024
Suryapet : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం.. పాక్షికంగా దెబ్బతిన్న 8 కార్లు
Suryapet : సూర్యాపేట జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరగ్గా.. 8 కార్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వచ్చి.. మంత్రి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు బయల్దేరారు. రోడ్డుపై ప్రయాణిస్తుండగా.. ప్రమాదం జరిగింది. 8 కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకున్నాయి. దీంతో కార్ల ముందు భాగాలు, బానెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అధికారులు, నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
ఎలా జరిగింది..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాన్‌పహడ్ వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గరిడేపల్లి గ్రామస్తులు భారీగా రోడ్డు వద్దకు వచ్చారు. మంత్రి కాన్వాయ్‌ని చూడాగానే నినాదాలు చేసుకుంటూ ముందుకొచ్చారు. ఎస్కార్ట్ వాహనం వారికి క్రాస్ అయ్యింది. ఆ తర్వాత ఉన్న వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో మంత్రి కారు కాకుండా.. వెనకాల ఉన్నవరి ఒకదాన్ని మరొకటి వెనకనుంచి ఢీకొట్టాయి. నాయకులు ప్రయాణిస్తున్న 8 కార్లు దెబ్బతిన్నాయి.
ట్రాఫిక్ జామ్..
ఈ ప్రమాదం జరగడంతో.. రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దెబ్బతిన్న వాహనాలను పక్కనబెట్టి.. మంత్రిని పంపించారు. అయితే.. మంత్రిని చూసేందుకు, కలిసేందుకు గరిడేపల్లి గ్రామస్తులు వచ్చారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ.. మంత్రి కాన్వాయ్‌కి అడ్డువచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
ఘనంగా ప్రారంభం..
జాన్‌పహాడ్ సైదులు దర్గా ఉర్సు గుసుల్ షరీఫ్ కార్యక్రమంతో.. ఉత్సవాలు గురువారం తెల్లవారుజామున వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సుమారు పదివేల మంది భక్తులు దర్గాను దర్శించుకున్నారు. గురువారం తెల్లవారక ముందే సంప్రదాయబద్ధంగా దర్గాలోని హజరత్ సయ్యద్ జాన్‌పాక్ షాహిద్ రహ్మతుల్లా అలై, సోదరుడు సయ్యద్ మొహినుద్దీన షా సమాధులపై ఉన్న పాతచాదర్, దట్టీలను తొలగించి శుభ్రం చేశారు. కొత్తచాదర్, దట్టీలు కప్పారు. సువాసనలు వెదజల్లే పూలదండలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
లక్షలాదిగా భక్తులు..
ఈ సందర్భంగా ఫకీర్లు గాన కచేరీ చేశారు. ముజావర్‌జానీ ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాలో నిరంతరం వెలిగే దీపంతోపాటు కొవ్వొత్తులు వెలిగించి ఉల్సా నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ ఉత్సవాలకు వెళ్లే క్రమంలోనే మంత్రి కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది.
టాపిక్