Best Web Hosting Provider In India 2024
Ramayana Review: రామాయణ రివ్యూ – తెలుగులో వచ్చిన మైథలాజికల్ యానిమేషన్ మూవీ ఎలా ఉందంటే?
Ramayana Review: యానిమేషన్ మూవీ రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Ramayana Review: వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. జపనీస్ యానిమే స్టైల్ లో రూపొందిన ఈ మూవీని జపాన్ కు చెందిన కోయిచి ససకి, యుగో సాకిలతో కలిసి రామ్ మోహన్ రూపొందించారు. 31 సంవత్సరాల క్రితమే జపాన్ లో విడుదలైన ఈ మూవీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
శ్రీ రాముడి బాల్యం నుంచి…
రామాయణం స్ఫూర్తితో జపాన్ యానిమేషన్ స్టైల్ లో ఈ సినిమా రూపొందింది. శ్రీరాముడికి బాల్యం నుంచి రామ రావణుల యుద్ధం, పట్టాభిషేకం వరకు జరిగిన కథను యానిమేషన్లో గ్రాఫిక్స్ ద్వారా ఈ మూవీలో చూపించారు. రాముడి గురించి అందరికి తెలిసిన కథనే యామినేషన్లో చెప్పారు.
అరణ్య వాసం…
శ్రీరాముడు శివధనస్సును విరవడం, సీతను పెళ్లి చేసుకోవడం, కైకేయి కు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మాట నిలబెట్టేందుకు 14 సంవత్సరాల పాటు సీత, లక్ష్మణులతో కలిసి అరణ్య వాసం చేయడం లాంటి అంశాలన్నింటిని డీటైలింగ్‌గా చెప్పడం బాగుంది. దశరథ మహారాజు మరణం తర్వాత ఏం జరిగింది? రాముడిని వెతుక్కుంటూ భరతుడు అడివికి ఎందుకు వెళ్లాడు? రావణుడు సీతను అపహరించడానికి ముందు చోటు చేసుకున్న సంఘటనలను ఇతిహాసాల్లో ఎలా ఉందో అలాగే చూపించారు.
క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో మేకర్స్ రామాయణాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయలేదు. సీత లంకలో ఉందని హనుమంతుడు ద్వారా తెలుసుకున్న రాముడు…రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లడం ఈ యుద్ధంలో రాముడు…. రావణుడిని అంతం చేసి అయోధ్యకు తిరిగి రావడం వరకు జరిగిన అన్ని అంశాలను ఈ యానిమేషన్ మూవీలో కనిపిస్తాయి.
మహా విష్ణువు అవతారాలతో…
రామ అవతారానికి సంబంధించి పుట్టుపూర్వత్తరాలతో రామాయణం సినిమా మొదలవుతుంది. మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చి లోక రక్షణ ఎలా చేశాడు? రాముడిగా అవతారం ఎత్తడానికి కారణమేమిటనే అంశాలను ఆరంభంలో చూపించడం బాగుంది.
డైలాగ్స్ స్వచ్ఛమైన తెలుగులో రాసుకున్నారు.రామాయణ సారాన్ని వివరిస్తూ అర్థవంతంగా సాగాయి. రాముడు, సీతతో పాటు మిగిలిన పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ బాగా కుదిరింది.
స్ఫూర్తిదాయకంగా…
ఎందరికో శ్రీరాముడు ఆరాధ్యుడిగా మారడానికి కారణం ఏమిటి? ఎన్ని కష్టాలు ఎదురైన తాను నమ్మిన ధర్మాన్ని వీడకుండా ఏకపత్ని వ్రతుడిగా, తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన కొడుకుగా ఉదాత్తంగా, స్ఫూర్తిదాయకంగా రాముడి జీవితం ఎలా సాగింది అన్నది రామాయణం మూవీలో డైరెక్టర్లు చూపించారు.
జపనీస్ యానిమే స్టైల్లో ఈ మూవీని మేకర్స్ తెరకెక్కించారు. 1993లోనే రూపొందిన మూవీ అయినా యానిమే గ్రాఫిక్స్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్నాయి. 4కేలో విడుదల చేయడం వల్ల క్వాలిటీతో చూసే అవకాశం తెలుగు ఆడియెన్స్‌కు దొరికింది.
సారాంశం:
రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ మూవీ పిల్లలను మెప్పిస్తుంది. రామాయణంపై వారికి అవగాహన కల్పిస్తూనే ఎంటర్టైన్ చేస్తుంది.