Best Web Hosting Provider In India 2024
దావోస్ నుంచి ఉత్తి చేతులతో రావడానికి సిగ్గులేదా?
మాజీ మంత్రి ఆర్‌కె రోజూ సూటి ప్రశ్న
రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దావోస్ వేదికపై నాశనం చేశారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నదని చంద్రబాబు ఏడుపు
రెడ్‌బుక్ అమలు చేస్తున్నామంటూ లోకేష్ ప్రకటనలు
తండ్రీ కొడుకుల నిర్వాకంతో పారిశ్రామికవేత్తల పరార్
మాజీ మంత్రి ఆర్‌కె రోజా స్పష్టీకరణ
వైయస్ జగన్‌గారి హయాంలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్
ఒక్క పర్యటనతోనే దావోస్ నుంచి భారీ పెట్టుబడులు
ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు
విశాఖ జీఐఎస్‌లో రూ.13.5 లక్షల కోట్లకు ఎంఓయులు
బాబు పాలన చూశాక పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయింది
ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన ఆర్‌కె రోజా
నగరి: దావోస్ నుంచి ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి రావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు సిగ్గు లేదా?. ఏ ముఖం పెట్టకుని ఏపీలో అడుగు పెడుతున్నారని అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా నిలదీశారు. తిరుపతి జిల్లా నగరిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే దావోస్‌లో పారిశ్రామికవేత్తలు పారిపోయారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల వారు లక్షల కోట్లు పెట్టుబడులతో తిరిగి వస్తుంటే.. చంద్రబాబు మాత్రం కట్టుకథలతో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను తండ్రీ కొడుకులిద్దరూ సర్వనాశనం చేశారని ఆర్‌కె రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆశతో ఎదురుచూపు. మిగిలింది నిరాశే:
చంద్రబాబు దావోస్ పర్యటన ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తారని ప్రజలు భావించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించారు. మొదటి ఏడాది దావోస్ వెళ్లారు. రాష్ట్ర ప్రజలు, కూటమి పార్టీల నాయకులు గర్వపడేలా దావోస్ నుంచి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి కనీసం ఈ ఏడాది కోసం నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించడం ద్వారా సంపద సృష్టిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఆయన రాష్ట్రంలో కాలుపెట్టగానే భారీగా సన్మానాలు, సత్కారాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చంద్రబాబు, లోకేష్ లు దావోస్ కు వెళ్ళి ఏం తీసుకువచ్చారని చూస్తే శూన్యం. ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు.
14 ఏళ్ల అనుభవం ఏమైంది?:
పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ రూ.1.32 లక్షల కోట్లు, మహారాష్ట్ర రూ.15.75 లక్షల కోట్లకు ఎంఓయులు చేసుకున్నారు. పద్నాలుగేళ్ళ సీఎం అనుభవం, విజనరీని అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఇంత దారుణంగా రాష్ట్రానికే అవమానం కలిగేలా ఉత్తి చేతులతో వస్తున్నారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఈ అవమానం.
చంద్రబాబు, లోకేష్ దావోస్ వెళ్ళేప్పుడు తమ ప్రచారం కోసం లోకేష్‌ను ప్రమోట్ చేసుకునేందుకు జాతీయ మీడియాకు పెద్ద ఎత్తున డబ్బును ఇచ్చేందుకు జీఓలు జారీ చేశారు. పవన్‌కళ్యాణ్ వల్లే ఈరోజు చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. కానీ పవన్‌కళ్యాణ్‌ను దావోస్‌కు తీసుకు వెళ్ళలేదు. తన కుమారుడు నారా లోకేష్‌కు రాబోయే రోజుల్లో పవన్‌కళ్యాణ్ అడ్డు వస్తాడనే అనుమానంతో ఆయనను పక్కకు పెట్టారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవీ?:
పెట్టుబడులు తీసుకురాలేక పోవడానికి కారణం లోకేష్ రెడ్‌బుక్ పాలనే. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ను తీసుకువచ్చి ఆమెతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలను భయపెట్టి, బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ సంఘటనను చూసిన తరువాత ఏ పారిశ్రామికవేత్త అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా? అంతేకాదు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కాంతిరాణా, విశాల్ గున్నీ వంటి వారిపైన కూడా తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇటువంటివి చూసిన తరువాత ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంటుంది.
ఇంకా పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోంది. ఇక శాంతిభద్రతల విషయంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి, చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతూ ఉంటే ఎవరైనా ఈ రాష్ట్రం వైపు వచ్చేందుకు సాహసిస్తారా? భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మంత్రి నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంటే, ఎవరైనా ఈ రాష్ట్రం వైపు చూస్తారా? రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగమే. చంద్రబాబు, లోకేష్ చేస్తున్న పనుల వల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిన్నది.
గత ప్రభుత్వం భారీ పెట్టుబడులు:
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఒకేసారి దావోస్ వెళ్లిన సీఎం వైయస్ జగన్, రూ.1.26 లక్షల కోట్లకు ఎంఓయులు కుదుర్చుకుని వచ్చారు. అలాగే విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రూ.13.5 లక్షల కోట్లకు ఎంఓయులు చేసుకున్నారు. ఈ నెలలో సాక్షాత్తు ప్రధాని శంకుస్థాపన చేసిన రూ.1.86 లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, అలాగే బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్‌లను సీఎంగా వైయస్ జగన్ గారు ఈ రాష్ట్రానికి తీసుకువచ్చారు. వైయస్ జగన్ గారు తీసుకువచ్చిన పెట్టుబడులకు మీ ఘనతగా ప్రారంభోత్సవాలు చేయించుకున్నారు.
వైయస్ జగన్‌గారు విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు రిలయన్స్ అధినే ముఖేష్ అంబానీతో పాటు, గౌతమ్ ఆదానీ, జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు స్వయంగా హాజరయ్యారు. ఆయన పాలన పట్ల పారిశ్రామికవేత్తలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. రాష్ట్రంలో పారదర్శక పాలన, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటేనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తారు.
వైయస్ జగన్‌గారి పాలనలో కట్టుదిట్టంగా శాంతిభద్రతలు, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయికి పాలన, మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్ట్ ల నిర్మాణం, భోగాపురం విమానాశ్రయం పనులు, పది ఫిషింగ్ హార్బర్ ల పనులు ముమ్మరం చేశారు. రెడ్ కార్పెట్ వేసి పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి పాలన అస్తవ్యస్తంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.
గాడి తప్పిన ప్రభుత్వ పాలన:
అలాగే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసినా గాడి తప్పిన పాలన వ్యవస్థ అర్థమవుతుంది. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇందుకు బాద్యులైన చంద్రబాబు సొంత టీంకు చెందిన టీటీడీ అధికారులను కాపాడుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని పవన్‌కళ్యాణ్ చెప్పినా కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పేద ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
దావోస్ పర్యటన లక్ష్యం అదే:
నారా లోకేష్ ను ప్రమోట్ చేసుకునేందుకే దావోస్ పర్యటన. రాష్ట్ర ప్రగతిపై చంద్రబాబుకు ఆసక్తి లేదు. దావోస్ వేదికపైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, పేద రాష్ట్రంగా మిగిలిపోయామంటూ మాట్లాడిన తరువాత ఏ పారిశ్రామికవేత్తకు ఏపీ పట్ల గౌరవం ఉంటుంది? ఎన్నికలకు ముందు కూడా దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని అబద్దాలు చెప్పారు. తీరా బడ్జెట్ లో మాత్రం ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయని చెప్పారు. అబద్దాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. ఇదే విధంగా దావోస్ లోనూ మాట్లాడటం వల్లే పారిశ్రామికవేత్తలు పారిపోయారు.
మరోవైపు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్ర పరిస్థితిని అస్తవ్యస్తం చేశారు. నడిరోడ్డుపైనే రాజకీయ కక్షలతో హత్యలు, విచ్చలవిడిగా దాడులు. ప్రశ్నించే వారిపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు మత్తులో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఉన్నాడు. దావోస్‌కు ఆయన్ను తీసుకువెళ్ళలేదు అంటే పవన్ వల్ల ఎటువంటి పెట్టుబడులు రావు అని చంద్రబాబు భావించారా? లేదా లోకేష్‌కు ప్రాధాన్యత తగ్గుతుందని అనుకున్నారా? ఇంకా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న భజన చూసిన పారిశ్రామికవేత్తలు దావోస్‌లో అవాక్కయ్యారు.