Best Web Hosting Provider In India 2024
Greater Hyderabad Congress : స్వరం మారుతోంది….! గ్రేటర్ లో చర్చనీయాంశంగా ‘దానం’ తీరు – ఎందుకిలా…?
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే దానం తీరు చర్చనీయాంశంగా మారింది. నేతలంతా ఓ దారిలో ఉంటే… దానం రూట్ మాత్రం సెపరేట్ అన్నట్లుగా ఉంది. ప్రధానంగా కూల్చివేతల విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. బతుకొచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేస్తారా..? అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
‘దానం నాగేందర్’… గ్రేటర్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన… కొద్దిరోజులకే కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు… పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా…. కొద్దిరోజులుగా ఆయనవ్యవహరిస్తున్న తీరు గ్రేటర్ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.
కొద్దిరోజులకే జంప్…!
దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. గతంలో ఆ పార్టీ తరపున పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన… మంత్రిగా కూడా పని చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన దానం నాగేందర్….. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ 2018 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,402 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో కీలకంగా మారారు. అంతేకాకుండా… 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున విక్టరీ కొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డిపై 22,010 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా… బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు కు తెరలేపింది. దీంతో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్… కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా… ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓడిపోయారు.
మారుతున్న స్వరం…!
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్… కారు పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ వచ్చారు. అసలు ఆ పార్టీలో కనీసం గౌరవం ఉండదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక అసెంబ్లీ వేదికగా… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పరుషపదజాలం ఉపయోగించి వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
అయితే గత కొద్దిరోజులుగా దానం నాగేందర్ తీరు గ్రేటర్ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… హైదరాబాద్ లోని చెరువులు, నాలాలను రక్షించటమే ధ్యేయంగా హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చింది. సీఎం రేవంత్ ఆలోచనలతో ఏర్పాటైన హైడ్రాను… ప్రభుత్వంలోని కీలక నేతలంతా స్వాగతిస్తూ వచ్చారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే దానం తీరు సెపరేట్ గా ఉందనే చెప్పొచ్చు. ఆయన నియోజకవర్గ పరిధిలో జరిగిన హైడ్రా కూల్చివేతలను దానం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పనులతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ కూడా హితవు పలికే ప్రయత్నం చేశారు.
తాజాగా చింతల్ బస్తీలో జీహెచ్ఎంసీ, పోలీసు, ట్రాఫిక్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫుట్ పాత్లు ఆక్రమణలను తొలగించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దానం… అక్కడికి చేరుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన పర్మిషన్ లేకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. నిబంధనల మేరకే కూల్చివేతలు చేస్తున్నట్లు అయితే… ముందుగా ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభించాలంటూ హితవు పలికారు. అక్కడ కూల్చివేతలు చేసిన తర్వాత… తన నియోజకవర్గానికి రావాలంటూ కామెంట్స్ చేశారు.
తాను హైదరాబాద్ వాడినే ఇక్కడ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోనంటూ దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతల విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని… అప్పటివరకు ఆపాలని కోరారు.
నిజానికి నగరంలో హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ కూల్చివేతల విషయంలో దానం నాగేందర్ చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. అధికారులను తీవ్రస్థాయిలో మందలిస్తున్నారు. కూల్చివేతల నిర్ణయం సరికాదని… ఇలాంటి వాటితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజుల కిందట ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫార్ములా ఈరేస్ కేసుపై స్పందించారు. ఫార్ములా ఈరేస్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ అరెస్ట్ అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కూడా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫార్ములా ఈరేస్ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో… ఎమ్మెల్యే దానం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయనే చర్చ కూడా వినిపించింది.
మొత్తంగా అధికారపక్షంలో ఉన్న దానం నాగేందర్ తీరుపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయనే చెబుతున్నారు. ఎమ్మెల్యే దానం తీరు స్వపక్షంలో విపక్షంలా ఉందనే గుసగసులు కూడా వినిపిస్తున్నాయి…!
సంబంధిత కథనం
టాపిక్