మన ప్రభుత్వం చేసిన మంచిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి

Best Web Hosting Provider In India 2024

ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలు వినిపించాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు

తాజా పరిణామాలపై పూర్తి అవగాహనను పెంచుకోవాలి

సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సాధించాలి

విషప్రచారాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి: స‌జ్జ‌ల దిశానిర్దేశం

‘మీడియా కమ్యూనికేషన్స్‌’పై వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్ 

తాడేపల్లి: స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాజకీయ పార్టీ చేయలేనంత గొప్పగా వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి చేసిందని, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే పార్టీలకే సానుకూలత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశలోనే వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత  వైయస్‌ జగన్‌ ఆలోచనలు, ఆచరణను పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం మీడియా కమ్యూనికేషన్స్‌పై వర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌కు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా క‌మ్యూనికేష‌న్స్‌పై దిశానిర్దేశం చేశారు. 

అవగాహనతో పని చేయాలి:
    రాష్ట్రంలోని లక్షలాది ప్రజలతో పాటు, నేరుగా మనతో సంబంధాలు లేని వారు కూడా నిత్య జీవితంలో తమ అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి భావ వ్యక్తీకరణ ప్రజలపై ప్రభావం చూపుతుంది. దాన్ని పటిష్టంగా వినియోగించుకోగలిగితే మనం మరింత బలోపేతం అవుతాం. అందుకే వైయస్సార్‌సీపీ కార్యకర్తలు సామాజిక మాథ్యమాల్లో మిసైళ్ళలా తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. సరైన సమాచారంతో జరుగుతున్న పరిణామాలపై తక్షణం స్పందించే అవకాశం ఇప్పుడు మనకు ఉంది. నాడు మన ప్రభుత్వంలో ఏం చేశాం? అనేది గుర్తుంచుకుని, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటన్న దానిపైనా అవగాహన పెంచుకోవాలి. అలాగే మన పార్టీ విధానాలకు అనుగుణంగా మన వాణిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే దానిపై దృష్టి సారించాలి.

మనం చేసిన మంచిని  గొప్పగా చెప్పుకోవచ్చు:
     దేశం మొత్తం మీద గర్వంగా చెప్పుకునేలా స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేశాం. గత ప్రభుత్వంలో జగన్‌గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది అపోహ మాత్రమే. అదే నిజమైతే 2019లో కూడా వైయ‌స్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. అయినా కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది. మీడియా పబ్లిసిటీలో నిజం ఉంటేనే ప్రజలు దానిని పూర్తి స్థాయిలో విశ్వసిస్తారు.
    తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీడియా ప్రచారం అండతోనే నడుస్తోంది. ఆ పార్టీకి కొంత బలమైన అనుకూల మీడియా ఉండడంతో, అబద్ధాలను కూడా వేగంగా ప్రచారం చేస్తున్నారు. అలా ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మీడియా పెద్ద ఎత్తున చూపిస్తున్నా, అది వాస్తవం కాదు అనేది మనం గ్రహించాలి. మనం కూడా ఆ ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. మన ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో పాటు, పటిష్టమైన  నాయకత్వంలోని సమర్ధుడైన నాయకుడి ఆధ్వర్యంలో నడిచిన పాలనను గుర్తించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియా, సోషల్‌ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా ప్రజలకు ఇంకా చేరువ కావాలి. అలాగే, ప్రభుత్వ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి.

ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలి:
    పార్టీలో కొత్తగా పదవులు స్వీకరించిన వారు, బాధ్యతలు చేపట్టిన వారు మీ ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలు, వివిధ శక్తుల ముందు మీ వాదనను సమర్థంగా వినిపించాలి. అందుకోసం అవసరమైన ప్రోత్సాహాన్ని, సమాచారాన్ని, విధానాలను అందించేందుకే ఈ కార్యక్రమం. అధికారంలోకి రాక ముందు ఒక ఆవేశంతో పని చేశాం. అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ పరిణామాలతో ఆవరించిన నిరుత్సాహాన్ని విడిచిపెట్టి, ఆత్మవిశ్వాసంతో పార్టీ వాదనను శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రజల ఆలోచనా ధోరణులు ప్రభావితం చేసే ప్రధాన సాధనంగా మారింది. దాని ద్వారా నిబద్ధతతో కూడిన వాస్తవాలను తీసుకెళ్తే, ప్రజలు కచ్చితంగా విశ్వసిస్తారు. అందుకే బలీయమైన ఆ ప్రచార సాధన వినియోగంలో పార్టీ నాయకులంతా చురుగ్గా వ్యవహరించాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. 

వ‌ర్క్‌షాపులో వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, పలువురు క్రియాశీల నేతలు, నాయకులు పాల్గొన్నారు.
 

Best Web Hosting Provider In India 2024