Best Web Hosting Provider In India 2024
Saireddy Resignation: విజయసాయిరెడ్డి రాజీనామా.. తెరవెనుక ఏమి జరిగింది… వ్యూహాత్మకమా.. వదిలించుకున్నారా?
Saireddy Resignation: వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. విజయసాయిరెడ్డి రాజీనామా భవితవ్యం గురించి వైసీపీలో కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నా అనూహ్యంగా నిర్ణయాన్ని ప్రకటించారు.
Saireddy Resignation: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేశారు. వైసీపీలో కీలకమైన నాయకులు పార్టీకి ఒకే రోజు రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. వైసీపీలో నంబర్ 2 స్థానంలో తిరుగు లేని అధికారాన్ని అనుభవించిన సాయిరెడ్డి అనూహ్యంగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాపార నిర్వహణ బాధ్యతల నుంచి మొదలైన సాయిరెడ్డి పయనం అనూహ్యంగా ముగించారు. జగన్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఆయనతో కలిసి సాయిరెడ్డి పయనించారు. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగినా ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయనకు కీలక బాధ్యతలు దక్కాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సాయిరెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
2022లో వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని జగన్ తప్పించినప్పటి నుంచి ఇద్దరి దూరం పెరిగినట్టు సన్నిహితులు చెబుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డి తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించారు. వైసీపీలో జగన్ తర్వాత స్థానాన్ని సాయిరెడ్డి పోషించారు. ఈ క్రమంలో పార్టీలో మిగిలిన ముఖ్య నేతలతో ఆయనకు పొసగలేదు.
ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నంలో తలెత్తిన వివాదాలకు సాయిరెడ్డి కేంద్ర బిందువుగా మారారు. భూవివాదాలు, సెటిల్మెంట్ల ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలకు విశాఖ కేంద్రంగా మారింది. దీంతో పాటు పార్టీలో ఆధిపత్య పోరులో ఆయన ఒంటరి అయ్యారు. ఓ వైపు వైవీ సుబ్బారెడ్డి, మరోవైపు సజ్జల వంటి వారి నుంచి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2022లో అనూహ్యంగా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించారు.
ఉత్తరాంధ్ర బాధ్యతలు తప్పించిన తర్వాత సాయిరెడ్డి దాదాపు ఆర్నెల్ల పాటు తాడేపల్లికి కూడా రాలేదు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన నేతలు సమర్ధంగా వ్యవహరించక పోవడం, ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించ లేకపోవడం వంటి కారణాలతో అనివార్యంగా సాయిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత సాయిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతల్ని అప్పగించారు. ఆ తర్వాత కొద్ది నెలలకు దక్షిణ కోస్తా జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం, తిరుపతి, నరసరావుపేట, నెల్లూరు జిల్లాలను సాయిరెడ్డికి అప్పగించారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల నిర్వహణ, సమన్వయం వంటి అంశాల్లో సాయిరెడ్డి చురుగ్గానే వ్యవహరించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిణామాలు మారిపోయాయి. వివాదాలు చుట్టు ముట్టాయి. వ్యక్తిగతంగా సాయిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. మరోవైపు పార్టీ ఓటమికి కారణాలను బేరీజు వేసుకునే క్రమంలో 2019-24 మధ్య కీలకంగా వ్యవహరించిన నేతల తీరుతో ఎక్కువ నష్టం జరిగిందనే భావన జగన్మోహన్ రెడ్డిలో పెరిగినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఓటమితో పాటు ఇతర అంశాలకు ముఖ్య నేతల్ని నిందించడం వారికి మనస్తాపం కలిగించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
అంతు చిక్కని భయాలే కారణమా..?
రాజకీయ కారణాలతో పాటు వైసీపీ ముఖ్య నాయకుల వరుస రాజీనామాల వెనుక కేసుల భయం వెంటాడినట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం. విజయసాయిరెడ్డి ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న పలు కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నారు. వైసీపీ ఓటమి తర్వాత ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ కేసు వ్యవహారంలోనే తాజా రాజకీయ పరిణామాలు జరిగి ఉంటాయనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. అనూహ్యంగా ఈ వ్యవహారంలో కొద్ది రోజుల గతంలో జరిగిన క్రయవిక్రయాలు రద్దైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇది జరిగిన రెండు రోజులకే అనూహ్యంగా సాయిరెడ్డి రాజీనామా వెనుక ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజీనామాలతో ఎవరికి లాభం…
వైసీపీలో ఒకే రోజు ఇద్దరు ఎంపీల రాజీనామా చేయడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యింది.లోక్‌సభలో ఆ పార్టీకి ముగ్గురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో బీజేపీకి ఎంపీల అవసరం ఉంది. కీలక బిల్లుల్ని నెగ్గించుకోవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు రాజీనామాలు చేస్తే ఏర్పడే ఖాళీల్లో బీజేపీ దక్కించుకోవచ్చు.
సంఖ్యాబలం నేపథ్యంలో టీడీపీ-బీజేపీ కూటమికి అవి దక్కుతాయి. సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డితో పాటు మరో ఎంపీ కూడా రాజీనామా చేస్తారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవిలు వైసీపీ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తిరిగి ఎంపీలుగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి సానా సతీష్ గెలిచారు. ఇప్పుడు మరికొన్ని స్థానాలు ఖాళీ అయితే అవి కూటమి ఖాతాకు దక్కుతాయి. వైసీపీ ఎంపీల రాజీనామాలు వ్యక్తిగత కారణాలతో అయినా జగన్ సమ్మతితోనే జరిగి ఉండొచ్చనే ప్రచారం కూడా ఉంది.
సంబంధిత కథనం
టాపిక్