Best Web Hosting Provider In India 2024
Sangareddy District : అంగన్వాడీ భవనంలో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు – ఐదుగురు పిల్లలకు తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లాలోని వెంకటాపూర్ అంగన్వాడి కేంద్రంలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో ఐదు మంది విద్యార్థులు గాయపడ్డారు. 108 సాయంతో చేయడంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి పరామర్శించారు.
సంగారెడ్డి జిల్లాలోని వెంకటాపూర్ గ్రామంలోని అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో 15 మంది చిన్నారులు చదువుతున్నారు. ఈ క్రమంలోనే స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా కిందపడ్డాయి. 15 మంది పిల్లల్లో… ఐదుగురు పిల్లలకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
రక్తాలు కారుతున్న పిల్లలను చూసి తల్లితండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసి సమాచారం అందించారు. పిల్లలందిరిని కూడా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరామర్శించిన ఎమ్మెల్యే…
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. పిల్లల పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వారికీ మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
ఆ తర్వాత అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్లి భవనాన్ని పరిశీలించారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీనే ఈ సంఘటనకు బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అంగన్వాడీ సెంటర్లను కూడా సరిగా నిర్మించలేకపోయిందని ఆరోపించారు.
విచారణకు ఆదేశించిన కలెక్టర్…
గాయపడిన చిన్నారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరామర్శించారు. నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఆయన… వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
గాయపడిన వారిలో ముగ్గురిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. మిగతా ఇద్దరినీ అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు. చిన్నారుల తల్లిదండ్రులతోనూ కలెక్టర్ మాట్లాడారు.చిన్నారుల ఆరోగ్య పరిస్థితి బాగుందని ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రిపోర్టింగ్: ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్