Best Web Hosting Provider In India 2024
Karimnagar : “వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్” – కరీంనగర్ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి అసహనం
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పదే పదే తోపులాట జరగటం, ఉన్నతాధికారుల లేకపోవటంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కరీంనగర్ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉగ్రరూపం చూపారు. కలెక్టర్ పమేలా సత్పతి పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ‘ఎనీ కామన్ సెన్స్?’ అంటూ మందలించారు.
స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ లో 60 కోట్లతో పూర్తి చేసిన మల్టీ పర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఐదు డివిజన్లలో 24/7 నిరంతరాయంగా వాటర్ సప్లై, కుమార్వాడి హైస్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ లను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రులపైకి కార్యకర్తలు దూసుకొచ్చారు. కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్పీ ఎవరు? అంటూ ఆరా తీశారు. సీపీ అందుబాటులో లేకపోయేసరికి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్.”..!
24 గంటలు వాటర్ సప్లై, డిజిటల్ క్లాస్ రూమ్ లు ప్రారంబిస్తుండగా బిజేపి కార్యకర్తలు మంత్రి పొంగులేటి మీదకు తోచుకొచ్చారు. పదే పదే తోపులాట సీన్లు చోటు చేసుకోవడం, బీజేపీ కార్యకర్తల నినాదాలు మంత్రిని అసహనానికి గురి చేసింది.
మంత్రుల పర్యటనలో పోలీసు ఉన్నతాధికారులు కూడా లేకపోవడంతో సహనం కోల్పోయిన మంత్రి పొంగులేటి కలెక్టర్ పై అసహనం ప్రదర్శించారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా మందలించారు. అదే సమయంలో మంత్రి పొన్నం కలగజేసుకుని కనీసం ఏసీపీ కూడా లేడంటూ అధికారులకు చురుకలంటించారు. మంత్రులు అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేయడం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో చర్చనీయాంశంగా మారింది.
24 గంటల వాటర్ సప్లై ప్రారంభం:
కేంద్ర పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ది విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ బండి సంజయ్…. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో కలిసి కరీంనగర్ లో పర్యటించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 60 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, 24 గంటలు నిరంతరాయంగా వాటర్ సప్లైని ప్రారంభించారు.
ఆ తర్వాత డంపింగ్ యార్డ్ ను సందర్శించి పరిశీలించారు. హౌసింగ్ బోర్డు కాలనీ 24 గంటలు నిరంతరాయంగా వాటర్ సప్లైని ప్రారంభించి అక్కడే జరిగిన సభలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నగరమంతా అమలు చేస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది కోటి ఇండ్లు నిర్మించబోతున్నామని, అందులో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తామని అందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని తెలిపారు.
హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో కేంద్రమంత్రి ఖట్టర్ తెలుగులో మాట్లాడి కరీంనగర్ గొప్పతనం గురించి తెలిపారు. పవిత్రమైన గోదావరినది, ప్రముఖ ఆలయాలున్న ఆధ్యాత్మికమైన భూమి కరీంనగర్ అని, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఉమ్మడి జిల్లాలోనే ఉండటం గొప్ప విషయం అన్నారు. అలాంటి పుణ్య భూమిని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దేశంలోనే తెలంగాణ సుసంపన్నమైన రాష్ట్రమని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్న బండి సంజయ్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని మనోహర్ లాల్ కట్టర్ తెలిపారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్