Best Web Hosting Provider In India 2024
Huzurabad : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి.. అసలు ఏం జరిగింది?
Huzurabad : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాల దాడి జరిగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్న ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనపై కోడిగుడ్లు, టమాటాలతో దాడికి దిగారు. దీంతో గ్రామసభ కాస్త గందరగోళంగా మారింది.
హనుమకొండ జిల్లాలో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఝాన్సీ రాణి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ముందుగా గ్రామ సభను ఉద్దేశాన్ని అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు.
రేషన్ కార్డులతో స్టార్ట్..
ఇంతవరకు బాగానే ఉన్నా.. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ తౌటం ఝాన్సీరాణి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు.
యుద్ధ వాతావరణం..
అప్పటికే సభా వేదికపై కూర్చున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కల్పించుకుని.. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 11 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. దీంతో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదంటూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వాదనకు దిగారు. అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో సభా ప్రాంగణంలో వద్ద యుద్ధ వాతావరణం కనిపించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న కాజీపేట ఏసీపీ తిరుమల్.. ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సభ తిరిగి ప్రారంభం అయ్యింది.
సభలో వాగ్వాదం..
సభలో అధికారులు ఇందిరమ్మ ఇండ్ల ప్రస్తావన తీసుకు రావడంతో.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి కల్పించుకున్నారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ అబద్దాలు చెబుతోందన్నారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
కౌశిక్ ఫైర్..
‘నీ యవ్వ.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయే ఇజ్జతి లేనోళ్లు.. మీరు కూడా మాట్లాడేటోళ్లు అయ్యిర్రా.. కొంచెమైనా సిగ్గుండాలి. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినోళ్లు.. నా మోచేతి నీళ్లు తాగి గెలిచినోళ్లు.. ఆ పార్టీలోకి పోయి లొల్లిపెట్టుడు ఎక్కడిది. నీయవ్వ.. ఏం మనుషులురా’ అంటూ పరుష పదజాలంతో స్పందించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
కౌశిక్ రెడ్డి వెర్షన్..
స్టేజీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. అందరికీ ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేక గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం గ్రామ సభల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. అందుకే ఈ గ్రామ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా అంటూ.. స్టేజీ దిగుతున్న క్రమంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కోపంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు.
క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
కాంగ్రెస్ కార్యకర్తలు విసిరిన ఓ కోడిగుడ్డు అక్కడున్న అధికారులకు తాకింది. సభలో గందరగోళం ఏర్పడింది. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయన్న ఉద్దేశంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరువర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేదిక దిగి కాన్వాయ్‌లో వెళుతుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ పైకి చెప్పులు విసిరారు. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సజావుగా సాగిన సభ..
కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం అధికారులు మళ్లీ గ్రామ సభ నిర్వహించారు. పూర్తిగా వరకు సజావుగా సాగింది. నాలుగు పథకాలకు సంబంధించిన అర్హుల జాబితా చదువుతున్న ప్రభుత్వం.. అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేస్తారా అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారంటూ.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సజావుగా సాగుతున్న సభలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గందరగోళం లేపి, వెళ్లారని మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ తౌటం ఝాన్సీ రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్