Best Web Hosting Provider In India 2024
Parenting Tips: తల్లిదండ్రుల ప్రేమకు కూడా హద్దులు ఉంటాయి తెలుసా? ఇలా చేశారంటే మీ పిల్లలు అన్నింట్లో ఓడిపోతారు!
Parenting Tips: చాలా అవసరం. అయితే మీ ప్రేమకు, రక్షణకు కూడా ఒక హద్దు ఉండాలని మీకు తెలుసా? మితిమీరిన రక్షణ చాలా విధాలుగా వారి పురోగతికి చాలా రకాలుగా హాని చేస్తుంది. కనుక పిల్లల పెంపకం విషయంలో ఇలా సమతుల్య వైఖరిని అవలంబించండి.
ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సంస్థల్లో చదువుకున్న పిల్లలు జీవితంలో చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోలేకపోతున్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆచరణాత్మక జ్ఞానం లేకపోవడం వల్ల జీవితంలో, సంబంధాల విషయంలో చాలా మంది సమన్వయం సాధించలేకపోతున్నారు. వాస్తవానికి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రుల రక్షణ వలయం అవసరం, కానీ అది ఒక హద్దు వరకే అని గుర్తుంచుకోండి. అతి ప్రేమ, రక్షణా భావం పిల్లలను పాడు చేస్తుంది. వారి వ్యక్తిత్వానికి అడ్డుకట్టగా మారుతుంది. దీని గురించి మానసిక నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే ఏమిటి?
తల్లిదండ్రుల మితిమీరిన రక్షణ, ఓవర్ ప్రొటెక్టివ్ పెంపకాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు శారీరకంగా లేదా మానసికంగా ఎప్పుడూ బాధపడకుండా చూసుకోవాలనుకుంటారు. దీని కోసం వారు పిల్లలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే అందజేస్తారు. ఎల్లప్పుడూ తమ పర్యవేక్షణలోనే పిల్లలను ఉంచుకుంటారు. పిల్లలు సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం లేదా ఏదైనా వారికి చెప్పకుండా కొత్తగా చిన్న చిన్న పనులు చేయడం వంటి విషయాలను సహించరు. దీన్ని పిల్లల మీద ప్రేమ, వారి మంచి కోసం రక్షణ వలయంగానే భావిస్తారు. కానీ నిజానికి ఇది ఒకరకంగా పిల్లల పురోగతికి అడ్డుకట్ట వేస్తుంది. ఇలా చేయడం వల్ల పిల్లలకు అన్ని విషయాల్లో నైపుణ్యం రాదు.. పెద్దయ్యాక, వారు ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వారిని వెనక్కి నెట్టేస్తుంది. ఈ రకమైన పెంపకం పిల్లలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం.
అతిప్రేమ, రక్షణ ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి..
1. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం లోపించడం
తల్లిదండ్రుల మితిమీరిన రక్షణ వలయం వల్ల పిల్లల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తీవ్రంగా లోపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ప్రతి వ్యక్తి తన నైపుణ్యాలను ఉపయోగిస్తాడు. మితిమీరిన రక్షణ వలయం ఈ నైపుణ్యాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుంది. దీనివల్ల వ్యక్తిలో సరళత, ఆత్మవిశ్వాసం లోపిస్తాయి.
2. ఆవేశపూరిత ప్రవర్తన, నిరాశకు గురికావడం
తల్లిదండ్రుల అతిప్రేమ, రక్షణ వలయంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కూడా ప్రతిదానికి చాలా భావోద్వేగానికి లోనవుతారు. వారు ఏదైనా పని చేయలేకపోతే బాగా నిరాశకు గురవుతారు. అయితే ఆవేశపూరితంగా తయారవుతారు లేదంటే ఉదాసీనంగా ఉంటారు. ఇది వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.
3. అభద్రతా భావం
అది చేయద్దూ, ఇది చెయ్యద్దూ అనే మాటలు వినీ వినీ పిల్లల్లో విసుగు వస్తుంది. మాట వినకపోవడం అనేది అలవాటుగా మారుతుంది. దీనివల్ల వారికి చాలా అభద్రతా భావం కలుగుతుంది. మంచి చెడులు ఆలోచించకుండా, ఇతరులు చెప్పినా వినకుండా నచ్చింది చేసుకోయేలా తయారవుతారు.
4. ఎల్లప్పుడూ ఒత్తిడిలో ఉండటం
మితిమీరిన రక్షణలో పెరిగిన పిల్లలు తమ జీవితమంతా ఒత్తిడిలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దయ్యాక కూడా వారు భయస్తులుగా, నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తులుగా మారతారు. ఇతరులు ఎల్లప్పుడూ తమను ఇష్టపడాలని కోరుకుంటారు.
మీ ప్రేమ, రక్షణ ఎంత వరకూ ఉండాలి?
- మొదటి అడుగు నుండి మొదటి స్కూల్, మొదటి డాన్స్ వరకు, మీ బిడ్డ జీవితంలో చాలా కొత్త విషయాలను ప్రయత్నిస్తాడు. ఇలా వారు కొత్త, ఉత్తేజకరమైన పనులను మొదటి చేస్తున్నప్పుడు అవకాశాల విషయంలో వారిని భయపెట్టకూడదు. జాగ్రత్తలు చెప్పడం మంచిదే కానీ అవి భయాన్ని తొలగించేలా ఉండాలి. అభద్రతా భావాన్ని పెంచేలా ఉండకూడదు. కొత్త విషయాలు, అనుభవాలను ప్రయత్నించనివ్వండి. నేర్చుకోనివ్వండి.
- తల్లిదండ్రులుగా పిల్లల నుండి రోజువారీ పనులను ఆశించడం ముఖ్యం. మీ బిడ్డకు కొన్ని సరైన నియమాలు, పరిమితులను నిర్ణయించండి. బలవంత పెట్టకుండానే వాటికి పాటించేలా ప్రేరేపించండి. అప్పుడే వారు పెద్దయ్యాక సవాళ్లను ఎదుర్కోగలరు.
- స్కూల్లో, ఇంట్లో లేదా బయట ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలను ఎదురైనప్పుడే వారు వాటిని పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు. ప్రతి చిన్న సమస్యలో వారికి మీరే సహాయం చేస్తే, సమస్యలను ఎదుర్కోవడం, పరిష్కరించడం ఎప్పటికీ నేర్చుకోలేరు.
- ప్రతి బిడ్డలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ బిడ్డలోని ఆ ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి, దానిని మెరుగుపరచడంలో సహాయపడండి. మీ ఇష్టాలను, నైపుణ్యాలను వారిపై బలవంతంగా రుద్దకండి.