Best Web Hosting Provider In India 2024
Osmania Hospital : వందేళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, ఈ నెల 31న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Osmania Hospital : జనవరి 31న ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
Osmania Hospital : రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 31న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వేరుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
అండర్ గ్రౌండ్ పార్కింగ్, అండర్ పాస్ లు
ఆసుపత్రి భవన నిర్మాణాలు, పార్కింగ్, ల్యాండ్ స్కేప్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని, అవసరమైనచోట ఇతర మార్గాలను కలిపేలా అండర్‌పాస్‌లు నిర్మించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, పరామర్శకు వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలన్నారు.
డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటిన్, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుండడంతో వారు వచ్చేందుకు రెండు మూడు రోజులు పడుతోందని.. అప్పటి వరకు మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు.
హెలీ అంబులెన్స్ కోసం హెలీప్యాడ్
అవయవాల మార్పిడి.. అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని… ఆసుపత్రికి వచ్చామనే భావన ఉండకూడదని సీఎం సూచించారు. ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను సూచించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, అధికారులు పాల్గొన్నారు.
టాపిక్