Best Web Hosting Provider In India 2024
AP Village Ward Secretariats : సచివాలయాల వర్గీకరణ, ఉద్యోగుల విభజనపై ఉత్తర్వులు జారీ – ముఖ్యమైన అంశాలివే
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయల వర్గీకరణ, ఉద్యోగుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన వర్గీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఉత్తర్వులు విడుదల చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాను వర్గీకరిస్తూ జీవో నెంబర్ 1న విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదంతోనే ఈ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు మొత్తం 15,004గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో ఒక్కో గ్రామ సచివాలయానికి 11 మంది, ఒక్కొ వార్డు సచివాలయానికి 10 మంది ఉద్యోగులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను వర్గీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఉత్తర్వులోని కీలక అంశాలు:
- “గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను 1. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 2. టెక్నికల్ ఫంక్షనరీస్, 3. యాస్పిరేషనల్ సెక్రటరీలుగా వర్గీకరించింది.
- సచివాలయాలను మూడు రకాలుగా వర్గీకరించింది.
ఏ) 2,500 వరకు జనాభా ఉన్న సచివాలయాలను “A” కేటగిరీ
బీ) 2,501 నుండి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయాలను “B” కేటగిరీ
సీ) 3,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలను “C” కేటగిరీ
3. ఉద్యోగుల కేటాయింపు
ఏ) 2,500 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలలో కనీసం 6 మంది ఉద్యోగులు ఉంటారు.
బీ) 2,501 నుండి 3,500 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలలో 7 మంది ఉద్యోగులు ఉంటారు.
సీ) 3,501 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలలో 8 మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తిస్తారు..
డీ) సెక్రటేరియట్లలో జనాభా, ఆర్థిక కార్యకలాపాలు, పనిభారం ఆధారంగా ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చు.
4.ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు పాలనలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐ, డ్రోన్లు, ఇతర డీప్-టెక్నాలజీల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలి. సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల్లో ఐఓటీ, ఏఐ, ఎంఎల్ వంటి తాజా సాంకేతికతలపై మక్కువ ఉండి సాంకేతిక, సంబంధిత అర్హతలు ఉన్న ఒకరిని ఆస్పిరేషనల్ ఫంక్షనరీగా నియమించాలి.
5. ఉద్యోగుల వర్గీకరణ తరువాత, మిగిలిన ఉద్యోగులను ఇతర డిపార్ట్‌మెంట్‌లకు బదిలీ చేస్తారు.
6.పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయానికి, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి వార్డు సచివాలయానికి అధిపతిగా నియమితులవుతారు.
7.మూడంచెల గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయం, మండలం, మున్సిపాలటీ స్థాయిలో ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, గ్రామ/వార్డు స్థాయిలో సచివాలయాలు ఉంటాయి.
8.సచివాలయాలు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, ఏఐ, ఎంఎస్ఎంఈలకు సౌకర్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి కల్పన మొదలైన వాటితో సచివాలయాలు నాలెడ్జ్ సొసైటీ క్రియేట్ చేయడానికి కేంద్రంగా పనిచేస్తాయి.
9.స్వర్ణ ఆంధ్ర విజన్ @ 2047 సాధించడానికి, గ్రామ, వార్డు స్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్స్ సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాలను, ఉద్యోగులను వర్గీకరించినట్లు” ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల్లో తెలిపింది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్