Best Web Hosting Provider In India 2024
Sangareddy District : విద్యార్థులతో పని చేయించిన టీచర్లు – ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
స్కూల్ లో విద్యార్థులతో పని చేయించిన టీచర్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు మహిళా టీచర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నారాయణఖేడ్ లోని అంగన్వాడీలో పెచ్చులూడిన ఘటనలో మరో ఇద్దరిపై కూడా కలెక్టర్ వేటు వేశారు.
సంగారెడ్డి పట్టణంలోని ఏపీహెచ్ బి కాలనీ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పని చేయించారు. క్రీడా మైదానంలో ఉన్న రాళ్లు ఇతర సామాగ్రిని విద్యార్థులతో మోయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విచారణకు ఆదేశించి.. చర్యలు చేపట్టారు. ముగ్గురు మహిళా ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు.
విచారణ చేపట్టిన అధికారులు……..
సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి… పాఠశాలకు చెందిన ముగ్గురు ఎస్జీటీ ఉపాధ్యాయులు మంజుల, శారద, నాగమణిలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ విషయంపై కార్మిక శాఖ అధికారులతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
పాఠశాలలోని ప్రహారీగోడ కట్టడానికి తెచ్చిన కంకర స్కూల్ గ్రౌండ్ మధ్యలో ఉంది. రిపబ్లిక్ డే ఉత్సవాలకు అడ్డుగా ఉన్నాయని భావించిన టీచర్స్… కంకర తొలగించమని విద్యార్థులకు సూచించారు. దీంతో విద్యార్థులు కంకరను తీసే పని చేశారు. ప్రహరీ గోడ కడుతున్న కాంట్రాక్టర్ తో పాటు పని మనుషులు అక్కడే ఉన్నప్పటికీ.. పిల్లలతో టీచర్ల పని చేయటం చర్చనీయాంశంగా మారింది. పిల్లందరూ కూడా ఐదవ తరగతి లోపు చదువుతన్నవారే. భోజనం చేసే పల్లెంల్లో కంకరను ఎత్తటాన్ని కూడా అధికారులు తీవ్రంగా పరిగణించారు.
అంగన్వాడీలో పెచ్చులూడిన ఘటన – ఇద్దరిపై వేటు:
అంగన్వాడీలో పెచ్చులూడిన ఘటనలోనూ జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. నారాయణఖేడ్ సిడిపిఓ ఎన్ .సుజాత, వెంకటాపూర్ అంగన్వాడీ టీచర్ ఆర్ .అంబిక లను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటాపూర్ అంగన్వాడి కేంద్రంలో భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోయి ఆరుగురు చిన్నారులు గాయాలపాలైన సంగతి తెలిసిందే.
అలాంటి భవనాలను గుర్తించండి – కలెక్టర్ ఆదేశాలు
జిల్లాలోని ప్రమాదకరంగా ఉన్న అంగన్వాడి కేంద్రాల సమాచారం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ అధికారిణిని ఆదేశించారు. ప్రతి నెలకు ఒకసారి భవనాలను పరిశీలించాలని సూచించారు. పిల్లల భద్రతకు అవసరమైన అన్ని చర్యల చేపట్టాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న భవనాల నుంచి అంగన్వాడీ కేంద్రాలను వెంటనే ఇతర భవనాలకు మార్చాలని కలెక్టర్ ఆదేశించారు.
రిపోర్టింగ్: ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్