Best Web Hosting Provider In India 2024
Fenugreek Serum: ఎన్నో రకాల జుట్టు సమస్యలకు పరిష్కారం.. మెంతి సీరం! షాకింగ్ రిజల్ట్స్ కోసం ట్రై చేసి చూడండి
Fenugreek Serum: మీ జుట్టు ఒత్తుగా అందంగా పెరగాలా? మృదువుగా, మెరుస్తూ కనిపించాలనేదే మీ కోరికా? అయితే మెంతుల సీరంను ట్రే చేయండి. అనేక రకాల జుట్టు సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం అవుతుంది. మెంతుల సీరంను ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు రాలే సమస్య ఉంటే, కొందరికి జుట్టు పొడిబారడం, తెల్లబడటం వంటి సమస్యలు ఉంటాయి. ఇలా మీరు వేరు వేరు రకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు మెంతి సీరం చక్కటి పరిష్కారం అవుతుంది. జుట్టుకు మెంతుల సీరం రాసుకోవడం వల్ల ఏ జుట్టు సమస్యలు తొలగిపోతాయో తెలుసుకుందాం.
మెంతి (మేతి) వెంట్రుకల విషయంలో ఎంతో ప్రభావవంతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది! ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టును పోషించడంలో, మూలాల నుంచి బలపరచడంలో , జుట్టు పెరుగుదలని ప్రేరేపించడంలో సహాయపడతాయి. డ్యాండ్రఫ్ ను తరిమికొట్టడంలో జుట్టును ప్రకాశవంతంగా మార్చడంలోనూ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మెంతి సీరం వల్ల వెంట్రుకలను కలిగే లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది
జుట్టు పెరగకపోవడం, దువ్విన ప్రతిసారి కుప్పలు కుప్పలుగా రాలిపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతిరోజూ మెంతుల సీరం రాసుకోవడం మంచి పరిష్కారం లభిస్తుంది. మెంతులలో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది, కుదుళ్ల నుంచి బలపరుస్తుంది. దీనివల్ల జుట్టు ఎదగడంతో పాటు రాలడం సమస్య తగ్గుతుంది.
జుట్టు తెల్లబడటం తగ్గుతుంది
ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ తెల్ల వెంట్రుకల సమస్య వస్తుంది. అకాలంలో జుట్టు తెల్లబడటం వల్ల బాధపడుతున్నట్లయితే, ప్రతిరోజూ మెంతుల సీరంను వెంట్రుకల కుదుళ్లకు రాసుకోండి. ఇది జుట్టుకు సహజ రంగును అందించడంలో సహాయపడుతుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపగలుగుతుంది.
జుట్టు మెరుస్తుంది
జుట్టు పొడిబారి, చిక్కులు ఎక్కువగా ఉండే వారు మెంతుల సీరంను తరచూ జుట్టుకు స్ప్రే చేస్తూ ఉండాలి. లేదా వారానికి కనీసం ఒకసారైనా మెంతుల పేస్ట్‌ను జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా మారడంతో పాటు మెరిస్తూ ఉంటుంది.
దురద, పేన్ల నుండి ఉపశమనం
జుట్టులో దురద, పేన్లు, చుండ్రు వంటి సమస్యలు అనేక మందిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారు మెంతుల సీరంను వెంట్రుకల కుదుళ్లకు అప్లై చేసి చక్కగా మర్దనా చేసుకుంటూ ఉండాలి. దీంట్లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రపరచడంలో చక్కగా సహాయపడతాయి.
మెంతుల సీరం ఎలా తయారు చేయాలి?
- మెంతు సీరం తయారు చేసేందుకు రెండు టీస్పూన్ల మెంతుల గింజలను ఒక గాజు గిన్నెలో లేదా సీసాలో వేయండి.
- దానిలో ఒక గ్లాసు ఫిల్టర్ నీరు పోసి రాత్రంతా నానబెట్టండి.
- ఉదయం ఈ నీటిని వడకట్టి, స్ప్రే బాటిల్‌లో నింపండి.
మరో పద్దతిలో కూడా తయారు చేసుకోవచ్చు..
- ఒక గిన్నెలో నీరు పోసి దాంట్లో మెంతి గింజలను వేయండి.
- స్టవ్ ఆన్ చేసి 10 నుండి 15 నిమిషాలు పాటు వీటిని ఉడకబెట్టండి.
- నీరు రంగు మారిన తర్వాత ఈ నీటిని వడకట్టి.
- చల్లారిన తర్వాత బాటిల్ లో పోసి భద్రపరుచుకోండి.
మీరు షాంపూతో తలస్నానం చేయడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు ఈ నీటిని జుట్టుకు స్ప్రే చేసి, అలాగే ఉంచండి. పావు గంట పాటు ఇలా ఉంచిన తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.